ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేసే మున్సిపల్ ఆప్కాస్ కార్మికులు 1000 మందికి మార్చి నెలలో ఇవ్వాల్సిన జీతాలు నేటికి ఇవ్వలేదని, వెంటనే జీతాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు కార్పొరేషన్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించాలని ఫెడరేషన్ ఏలూరు నగర కమిటీ సమావేశం నిర్ణయించిందని ఆ సంఘ నాయకులు తెలిపారు. స్థానిక ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో ఫెడరేషన్ సమావేశం యూనియన్ అధ్యక్షుడు లావేటి కృష్ణారావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నగర కార్యదర్శి జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిధి పోర్టల్ పేరుతో కార్మికుల జీతాలను ఆలస్యం చేస్తున్నారని, దానివల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు ఇఫ్టూ ఏలూరు నగర అధ్యక్షుడు బి.సోమయ్య, పంతం చిన్న నాగరాజు, బంగారు వెంకటేశ్వరరావు, తానంకి జార్జి పాల్గొన్నారు.


