పాలకొల్లు సెంట్రల్: పోడూరు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డు రఘుమండ వెంకటరమణ (57) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా ఆదివారం రాత్రి స్టేషన్‌కు వెళుతూ పాలకొల్లు మార్టేరు రోడ్డులో ఉల్లంపర్రు వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో తన వాహనంలో పెట్రోలు కొట్టించుకున్నాడు. బంక్ నుంచి బయటకు వస్తుండగా ఓ కారు ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయిన రమణ తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆశుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కొరకు భీమవరం తరలించారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలిపారు. కారు టైర్ పంక్చర్ అవ్వడంతో అదుపుతప్పి హోంగార్డ్‌ను ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. రమణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమణ మృతి పట్ల పాలకొల్లు పట్టణ, రూరల్ సీఐలు కె రజనీకుమార్, జి శ్రీనివాస్, ఎస్సైలు, పోలీసులు, హోంగార్డులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు.


