గురువులకు స్పాట్‌ | - | Sakshi
Sakshi News home page

గురువులకు స్పాట్‌

Apr 7 2026 7:55 AM | Updated on Apr 7 2026 7:55 AM

25 కిలోమీటర్ల దూరంలో వారికీ విధులు

అమలు చేయాల్సిన వారే అతిక్రమిస్తే ఎలా?

ఉపాధ్యాయులపై ఒత్తిడి సరికాదు

పాఠశాలకు వెళ్ళిన తర్వాత మూల్యాంకనానికి రావాలని పిలుపు రావడంతో, దాదాపు 25 కిలోమీటర్ల దూరం నుంచి మూల్యాంకన కేంద్రానికి రావాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు లబోదిబోమన్నారు. నిబంధనల మేరకు మూల్యాంకన కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపాధ్యాయులకే విధులు వేయాల్సి ఉంది. 25 కిలోమీటర్ల కంటే దూరంలో ఉన్న వారిని సైతం విధులకు పిలవడం అన్యాయమని, వారు ఉదయం కేంద్రానికి చేరుకోవడం నుంచి తిరిగి ఇంటికి వెళ్లే వరకు తీవ్ర ఒత్తిడిలో ఉండే ప్రమాదం ఉంటుందని నాయకులు చెబుతున్నారు. ఉపాధ్యాయుడు ఒత్తిడిలో ఉంటే మూల్యాంకనంలో తేడాలు వస్తాయని, అది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందంటున్నారు. స్పెషల్‌ అసిస్టెంట్లుగా వేయాల్సిన సీనియర్లను, జూనియర్లను విడిచి మధ్యస్థ సర్వీసు ఉన్న వారిని వేయడం విమర్శలకు తావిస్తోంది.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను పెట్టిన స్పాట్‌ వాల్యుయేషన్‌ పేరుతో ముప్పుతిప్పలు పెడుతున్నారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా సిద్ధం చేసిన జాబితాలోంచి కొంతమందిని తొలగించి కొత్తవారికి విధులు వేసేందుకు ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు విద్యాశాఖాధికారులు ఎందుకు శ్రద్ధ చూపారని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయంలో విద్యాశాఖాధికారులకు భారీగానే ముడుపులు అందాయని, అలాగే రాజకీయ నాయకుల సిఫార్సులూ పనిచేశాయని ఆందోళన వ్యక్తం చేశారు.

జాబితా మార్పుపై సందేహాలు

పదో తరగతి విద్యార్థులు రాసిన జవాబు పత్రాల మూల్యాంకనం వాస్తవానికి ఈ నెల 4 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో ఈస్టర్‌ సెలవును గమనించకుండా షెడ్యూల్‌ విడుదల చేయడంతో, తర్వాత ఉపాధ్యాయులు ప్రాతినిధ్యం వహించగా ఈ నెల 6 నుంచి మూల్యాంకనం ప్రారంభమయ్యేలా షెడ్యూల్‌ను మార్పు చేశారు. 4 నుంచే ప్రారంభం కావాల్సిన మూల్యాంకనం కోసం అంతకుముందే జాబితా సిద్ధం చేయాల్సి ఉండగా, విద్యాశాఖాధికారులు 5 వ తేదీ సాయంత్రానికి గానీ జాబితా సిద్ధం చేయలేకపోయారు. ఆలస్యంగా జాబితా సిద్ధం చేసినా అందులో మార్పులు చేయాల్సి రావడం విద్యాశాఖాధికారుల వైఫల్యంగానే పరిగణించాలని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.

బడికెళ్లాక మూల్యాంకనానికి పిలుపు

ఆదివారం రాత్రికి చాలామందికి మూల్యాంకన విధులు ఉన్నట్టు మెసేజ్‌లు వచ్చాయి. మెసేజ్‌లు రాని వారంతా తమకు విధులు పడలేదని భావించి ఉదయమే పాఠశాలలకు వెళ్ళారు. అలా విధుల్లోకి వెళ్ళిన దాదాపు 30 మందికి పైగా ఉపాధ్యాయులకు మూల్యాంకన విధులకు హాజరు కావాలని అప్పటికప్పుడు మెసేజ్‌లు పంపడం, ఎంఈఓల నుంచి ప్రధానోపాధ్యాయుల ద్వారా వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాత్రి వరకు జాబితాలో లేని తమ పేర్లు, ఉదయం పాఠశాల విధులకు హాజరైన తర్వాత ఎలా చేరాయో తెలియక ఉపాధ్యాయులు గందరగోళానికి గురయ్యారు.

విఫలమైన ఆటోమేషన్‌ విధానం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో ప్రవేశపెట్టిన ఆటోమేషన్‌ విధానం మరోసారి విఫలమైందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. గతంలో ఇన్విజిలేషన్‌ విధుల్లో కూడా ఈ విధానం లోపాల పుట్టగా మారడంతో దానిని మార్చి తిరిగి ఎంఈఓలు, డీఈఓల చేతుల్లోకే నియామక ప్రక్రియ వెళ్ళిన విషయాన్ని గుర్తించకుండా, మళ్ళీ ఆటోమేషన్‌లో జాబితా రూపొందించడం హాస్యాస్పదం అంటున్నారు. ఆటోమేషన్‌ లోపాల వల్ల ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు మార్పులు చేయాల్సి వచ్చిందని కొందరు అంటుండగా, ఆ లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని విద్యాశాఖాధికారులు అస్మదీయులకు ఒకలా, తస్మదీయులకు ఒకలా విధులు వేశారని ఆరోపిస్తున్నారు.

నిబంధనలు అమలు చేయాల్సిన విద్యాశాఖాధికాారులే వాటిని అతిక్రమించడం భావ్యం కాదు. 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి విధులు వేయడంతో రవాణా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహిళా ఉపాధ్యాయులు ఇంటి పనులన్నీ ముగించుకుని అంత దూరం రావడం కత్తిమీద సాములాంటిది.

– గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్‌ 1938, రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌

మూల్యాంకన విధుల పేరుతో ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేయడం సరికాదు. తల్లిదండ్రులను, పిల్లలను చూసుకోవాల్సిన వారిని కూడా విధులకు పిలవడం వల్ల ఆ ఒత్తిడి మూల్యాంకనంపై పడుతుంది. ఇది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుంది.

– గెడ్డం సుధీర్‌, వైఎస్‌ఆర్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధికార ప్రతినిధి

బడికెళ్లిన తరువాత పేపర్ల వాల్యుయేషన్‌కు పిలుపు

ముందుగా తయారు చేసిన జాబితా మార్పు

25 కిలోమీటర్ల దూరంలో వారికీ విధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement