శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

Apr 7 2026 7:55 AM | Updated on Apr 7 2026 7:55 AM

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి పెద్దపులి జాడ వదంతులే! పీజీఆర్‌ఎస్‌లో 238 విజ్ఞప్తుల స్వీకరణ నీటి సంరక్షణ పనులను ఖరారు చేయాలి

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.గోపాలకృష్ణారావు సోమవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ ఈఓ వై.భద్రాజీ చిన్నవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.

కుక్కునూరు : మండలంలోని పెదరావిగూడెం పంచాయతీ, వెంకటాపురం గ్రామం వద్ద పెద్దపులి రోడ్డు దాటిందన్న వార్తలు సోమవారం కలకలం రేపాయి. ఆదివారం రాత్రి ఐటీసీ కర్మాగారం నుంచి వస్తున్న కార్మికులకు పులి రోడ్డు దాటుతూ కనిపించిందని గ్రామస్థులకు తెలపడంతో, వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది జంతువు వెళ్లిన మార్గంలో పాదముద్రలను పరిశీలించారు. రాత్రి వేళ కావడంతో పాదముద్రలు సరిగా కనిపించక పులో కాదో పోల్చుకోలేకపోయారు. సోమవారం ఉదయం అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతంలోని పాదముద్రలను పరిశీలించారు. అయితే, అవి పులి పాదముద్రలు కావని నిర్ధారించారు. పెదరావిగూడెం ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ జగదీష్‌ మాట్లాడుతూ.. పులి సంచరిస్తోందన్న వార్తలు కేవలం వదంతులు మాత్రమేనని స్పష్టం చేశారు.

ఏలూరు (టూటౌన్‌): పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందిన విజ్ఞప్తులు రీఓపెన్‌ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డా.ఎం.జె.అభిషేక్‌ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం జేసీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని సూచించారు. సోమవారం నాటి కార్యక్రమంలో మొత్తం 238 విజ్ఞప్తులు అందాయి. ఇందులో ఇన్‌చార్జ్‌ డీఆర్వో భాస్కర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం. ముక్కంటి, సర్వే శాఖ ఏడీ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో చేపట్టాల్సినన నీటి సంరక్షణ పనులను సాగునీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో కలిసి ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. శ్రీనీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యతశ్రీ కార్యక్రమంపై ఆమె సోమవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భూగర్భ జలమట్టం పెంచేలా ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలని, చెరువుల పూడికతీత, కాలువల మరమ్మతులు, గుర్రపుడెక్క తొలగింపు వంటి పనులపై నివేదికలు తక్షణమే సమర్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో గ్రామ, మండల పరిధిలోని సాగునీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో కలిసి పరిశీలించి గ్రామాల వారీగా నివేదికలను మండల ప్రత్యేకాధికారి ధ్రువీకరించిన అనంతరం సంబంధిత ఎంపీడీవోలు రెండు రోజుల్లోగా సమర్పించాలన్నారు. ఉపాధి హామీ పధకం, వీబీజీ రాంజీ కింద గుర్తించిన పనులపై కూడా నివేదికలు రూపొందించి సమర్పించాలన్నారు. వేసవిలో 6 మీటర్లు, వర్షాకాలం ముగిసే నాటికి 3 మీటర్లు భూగర్భ జలమట్టాలు పెరిగేలా కురిసిన ప్రతి నీటి చుక్కని ఒడిసిపట్టేలా నీటి సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. ఉద్యాన రైతులు తమ క్షేత్రాల్లో తప్పనిసరిగా ఫామ్‌ పాండ్స్‌ ఏర్పాటు చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement