పోలవరం రూరల్: తుపాను ప్రభావంతో చెదురుమదురుగా పడుతున్న జల్లులకు మొక్కజొన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంట ఆరబెట్టి ఉండటంతో చినుకులు పడితే బరకాలు కప్పి ఒబ్బిడి చేసుకునే పనులు చేపడుతున్నారు. పోలవరం మండలంలో పర్యటించిన వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మొక్కజొన్న రైతులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువత రైతులకు కష్టాలు పెరిగాయని విమర్శించారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రెండేళ్లుగా సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు రూ.3 వేల మద్దతు ధర నిర్ణయించి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల తరఫున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బుగ్గా మురళీకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


