డివైడర్‌ ఎక్కిన కారు | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ ఎక్కిన కారు

Apr 7 2026 7:55 AM | Updated on Apr 7 2026 7:55 AM

డివైడర్‌ ఎక్కిన కారు ఎస్సై కొట్టాడని పురుగుల మందు తాగిన యువకుడు వింత దూడ జననం.. మరణం పోలీసుల అదుపులో నకిలీ టికెట్ల స్కామ్‌ నిందితుడు? బంగారం చోరీపై కేసు నమోదు

తణుకు అర్బన్‌: తణుకు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు డివైడర్‌ పైకి దూసుకెళ్లింది. స్థానిక శర్మిష్ట సెంటర్‌ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉండ్రాజవరం మండలానికి చెందిన వ్యక్తి సోమవారం విజయవాడ నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిద్రమత్తులోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే డివైడర్‌ పై ప్రమాద సూచికలు ధ్వంసం కాగా కారు ముందు భాగం నుజ్జుయింది.

చికిత్స పొందుతూ మృతి

మంగళగిరి టౌన్‌, నిడమర్రు: ఎస్సై కొట్టాడని ఓ యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా నిడమర్రు గ్రామానికి చెందిన నండూరి శివకార్తికేయ (38)తన మేనకోడలు బంగారం గొలుసు పోవడానికి అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్‌ కారణమని ఆరోపించడంతో ఇరు వర్గాలు మార్చి 29వ తేదీ ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు మార్చి 30న నిడమర్రు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 31వ తేదీన నిడమర్రు బాల వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల్లో బందోబస్తు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్‌, పోలీస్‌ సిబ్బందితో శివకార్తికేయ కేసు విషయమై వాగ్వివాదానికి దిగాడు. తనపై కేసు నమోదు చేసి వేణుగోపాల్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్సైను ప్రశ్నించాడు. దీంతో శివకారిక్తేయను జీపులో స్టేషన్‌కు తీసుకువెళ్లి ఎస్సై రమేష్‌ కొట్టినట్లు శివకార్తికేయ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కల్యాణ మహోత్సవాల్లో అందరూ చూస్తుండగా ఎస్సై రమేష్‌ కొట్టాడని, విచారణ పేరుతో స్టేషన్‌కు తీసుకువెళ్లారని బాధితుడు శివకార్తికేయ ఏప్రిల్‌ 1వ తేదీన పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. శివకార్తికేయ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. పోలీసుల వేధింపులే మృతికి ప్రధాన కారణమని శివకార్తికేయ బంధువులు ఆరోపించారు.

ఆకివీడు: జన్యు లోపంతో వింత దూడ జన్మించి, వెంటనే మృతి చెందినట్టు పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకుడు జి.మల్లేశ్వరరావు సోమవారం చెప్పారు. స్థానిక కరెంట్‌ ఆఫీసు వద్ద ఉప్పల చిన్నాకు చెందిన పశువు ఆదివారం నాడు ప్రసవ సమయంలో ఇబ్బంది పడుతుందని రైతు ఫిర్యాదు చేయడంతో వెంటనే వెళ్లి ప్రేగుకు అడ్డంగా దూడ ఉందని గుర్తించి వైద్య సేవలందించామన్నారు. జన్యులోపంతో పుట్టిన దూడ గుర్రం ముఖం పోలి, వింత ఆకారంలో ఉందని, పుట్టిన వెంటనే దూడ చనిపోయిందని ఏడీ చెప్పారు. పశువును కాపాడినట్లు తెలిపారు.

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో రూ.200 దర్శనం నకిలీ టికెట్ల విక్రయాల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐఎస్‌జే రాజును సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుడి సోదరుడి ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా వారి సొంత ఊరు అయిన కాకినాడ జిల్లా, తుని వద్ద ఉన్న వేంపాడు గ్రామంలో ఐఎస్‌జే రాజు ఉన్నట్టు ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్‌ తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఉదయం వేంపాడు గ్రామానికి సిబ్బందితో కలసి వెళ్లిన ఎస్సై సుధీర్‌, అక్కడ పలువురిని విచారించారు. అనంతరం ఐఎస్‌జే రాజును గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నిందితుడు పోలీసుల సంరక్షణలో ఓ రహస్య ప్రదేశంలో ఉన్నట్టు సమాచారం.

టి.నరసాపురం: బంగారు ఆభరణాల చోరీపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం జయబాబు తెలిపారు. తెడ్లం పంచాయతీలోని మరియపురం గ్రామానికి చెందిన గొల్లపల్లి మరియరాణి ఈస్టర్‌ పండుగ కావడంతో ఈ నెల 4వ తేదీ రాత్రి చర్చికి వెళ్లింది. ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వచ్చింది. సోమవారం ఉదయం డ్వాక్రా డబ్బులు చెల్లించేందుకు బీరువా తెరవగా లాకర్‌ పగులగొట్టి ఉండటాన్ని గమనించింది. బీరువాలో ఉంచిన కాసున్నర బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement