గణపవరం: సాఫీగా సాగుతున్న దాళ్వాసాగు చివరిదశలో రైతులను బెంబేలెత్తిస్తోంది. పంట చేతికందివచ్చిన సమయంలో అకాల వర్షాలు రైతన్నకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రబీ పంట బాగా పండిందని ఆనందంగా మాసూళ్లకు ఏర్పాట్లు చేసుకుంటున్న రైతులకు వాతావరణ మార్పులు గుండెల్లో రైళ్లు పరుగు పెట్టిస్తున్నాయి. చేతికంది వచ్చిన పంట నోటికి అందకుండా పోతుందా అన్న ఆందోళన రైతులను వేధిస్తుంది. రెండు రోజులపాటు భారీ వర్షాలు పడేఅవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు అప్రమత్తమయ్యారు. సోమవారం మధ్యాహ్నం మండలంలో అక్కడక్కడా ఓమోస్తరు వర్షం కురిసింది. ముఖ్యంగా రబీపైరు కోతలు ప్రారంభించిన పిప్పర, చిలకంపాడు, కాశిపాడు గ్రామాల్లో వర్షం జల్లులు రైతులను ఉరుకులు పెట్టించాయి. కోతకోసిన ధాన్యం వర్షంబారిన పడకుండా కాపాడు కోవడానికి రైతులు ధాన్యం రాశులపై బరకాలు కప్పి ఉంచారు. చాలా మంది రైతులు ప్లాస్టిక్ బరకాలు, టార్ఫాలిన్‌లను సిద్ధం చేసుకున్నారు. . పూటకోరకంగా మారుతున్న వాతావరణం రైతుల గుండెల్లో గుబులు రేపుతుంది. వారం రోజులుగా విపరీతంగా ఎండలు కాయడంతో రైతులు వరికోతలు ప్రారంభించారు. చిలకంపాడు, వాకపల్లి, వీరేశ్వర పురం, కాశిపాడు గ్రామాల ఆయకట్టులో నాలుగు రోజులుగా వరి కోతలు ప్రారంభించారు. ధాన్యం రాశులు సమీప పుంతలు, గట్లుమీద నిల్వచేసి ఉంచారు. ఈసమయంలో వర్షం హెచ్చరికలతో రైతులు ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు చేపట్టారు. కోతకు ఏర్పాట్లు చేసుకున్న రైతులు వాయిదావేసుకున్నారు. మరోరెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్న హెచ్చరికలవల్ల కోసిన ధాన్యం ఎండబెట్టు కోవడానికి రైతులకు ధైర్యం చాలడంలేదు. ధాన్యం ఎండబెట్టడం, మళ్లీ పోగులుపెట్టి బరకాలు కప్పుకుంటూ ఇబ్బందులు పడేకన్నా వాతావరణం కుదుటపడిన తర్వాత ధాన్యం ఎండబెట్టుకోవచ్చునని వేచిఉన్నారు. గణపవరం, నిడమర్రు మండలాలలో దాదాపు 15 వేల ఎకరాలలో దాళ్వా సాగు చేశారు. ఇప్పటికి 10శాతం రైతులు కోతలు పూర్తిచేశారు. వాతావరణం అనుకూలిస్తే ఈ వారంలో దాదాపు వరికోతలు ముమ్మరమయ్యే అవకాశం ఉంది. ఈనెల మూడో వారాంతానికి రబీ మాసూళ్లు పూర్తవుతాయని వ్యవసాయఅధికారులు అంచనా వేస్తున్నారు.


