బుట్టాయగూడెం: శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గిరిజన యువకులు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జీలుగుమిల్లి మండలం తాటిరామన్నగూడెంకు చెందిన మడకం సంతోష్ (19), పండు సందీప్ (20) తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం చిచ్చోడుగుంటలో వేడుకకు హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా, గాండ్లగూడెం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అశ్వారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సందీప్, సంతోష్‌ల మృతితో తాటిరామన్నగూడెంలో విషాద చాయలు అలముకున్నాయి.
భీమడోలు: పొలసానిపల్లి పంచాయతీ శివారు ఆంజనేయనగరం గ్రామంలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, రూ.68 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుడు ముత్తంశెట్టి మణికంఠ తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటి వరండాలో నిద్రపోతుండగా, దొంగలు వెనుక తలుపు తీసి లోపలికి ప్రవేశించారు. బీరువా పగులగొట్టి అందులో ఉన్న రెండు కాసుల బంగారు తాడు, చెవిదిద్దులు, నగదును అపహరించారు. ఆదివారం తెల్లవారుజామున నిద్రలేచిన మణికంఠ చోరీ జరిగినట్లు గుర్తించి భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఎస్.కే. మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జంగారెడ్డిగూడెం: కుక్క కాటుకు గురై సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడంతో సుంకర పోసిబాబు (37) అనే వ్యక్తి రేబిస్ వ్యాధితో మరణించాడు. పట్టణంలోని అంబికా రెస్టారెంట్ రోడ్డులో హోటల్ నడుపుతున్న పోసిబాబును ఆరు నెలల క్రితం కుక్క కరిచింది. ఈ నెల 3న ఆయనలో రేబిస్ లక్షణాలు కనిపించాయి. ఇది గమనించిన భార్య, కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ మంచినీటిని చూసి బిగుసుకుపోతున్నాడు. వైద్యులు ముఖంపై నీళ్ళు చల్లినప్పటికీ మరింతగా బెదిరిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే రాజమండ్రి, ఆపై కాకినాడ ఆసుపత్రులకు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. శనివారం సాయంత్రం ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి భార్య అనంతలక్ష్మి, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. ఎస్సై ఎన్.వి. ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బుట్టాయగూడెం: మండలంలోని కామవరం అటవీ ప్రాంతంలో వెలసిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. లారీలు, మినీ వ్యాన్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ తల్లికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి భీమవరంనకు చెందిన ఆలయ మాజీ ధర్మకర్త వడ్డీ సుబ్బారావు కుమారుడు వడ్డీ దివ్య శ్రీవీర వెంకట శ్రీకాంత్ దంపతులు 10 గ్రాముల బంగారం, మోటూరుకి చెందిన కారిచర్ల ఉషశ్రీ 7 గ్రాముల బంగారం సమర్పించారు. దాతలకు ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆశీర్వచనాలు అందించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు దాతలకు అమ్మవారి ఫొటో, ప్రసాదం అందజేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.


