దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని రాజరాజేశ్వరిదేవిగా అలంకరించారు. ఉదయం అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, నవగ్రహ మండపార్చన తదితర పూజ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ నిర్వహించారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, జడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హరే శ్రీనివాస కోలాటం రాయుడుపాలెం, రత్నాలకుంట, వారిచే కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఆలయం వద్ద మహా అన్నసమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు, ఈవో ఎన్.సతీష్ కుమార్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకుంటున్న కొఠారు అబ్బయ్య చౌదరి
అన్నసమారాధన
రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చిన అమ్మవారు


