మెటాలిక్‌ బ్యారన్‌తో రైతుకు మేలు | - | Sakshi
Sakshi News home page

మెటాలిక్‌ బ్యారన్‌తో రైతుకు మేలు

Mar 23 2026 8:35 AM | Updated on Mar 23 2026 8:35 AM

ఉపయోగకరంగా ఉంది

బుట్టాయగూడెం: అందుబాటులోకి వచ్చిన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలోని రైతులు వ్యవసాయంలో ముందుకు సాగుతున్నారు. బ్రెజిల్‌ నుంచి దిగుమతి చేసుకున్న లూజ్‌లీఫ్‌ బ్యారన్‌ ద్వారా క్యూరింగ్‌ చేసే పద్ధతిని గత ఏడాది ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. అవి సత్ఫలితాలను ఇవ్వడంతో ఈ ఏడాది ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో సుమారు 32 మెటాలిక్‌ బ్యారన్‌లను రైతులు ఏర్పాటు చేసుకున్నారు. వర్జీనియా పొగాకు పంట చేతికి రావడంతో రైతులు ఇప్పుడు మెటాలిక్‌ బ్యారన్‌లలో క్యూరింగ్‌ చేసుకుంటున్నారు. వీటి ఏర్పాటుతో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందుతున్నామని రైతులు అంటున్నారు.

లూజ్‌ లీఫ్‌ బ్యారన్‌తో లాభాలు

లూజ్‌ లీఫ్‌ బ్యారన్‌ ఏర్పాటుతో ఎన్నో లాభాలు ఉన్నాయని పొగాకు రైతులు అంటున్నారు. పొగాకును ఐరన్‌ ట్రేలలో ఉంచి క్యూరింగ్‌ చేయడం వల్ల 50 శాతం కూలీల అవసరం తగ్గుతుంది. సాధారణ బ్యారన్‌లో ఒక లోడ్‌ పొగాకు క్యూరింగ్‌ అయితే, లూజ్‌ లీఫ్‌ బ్యారన్‌లో దానికి రెండింతల వర్జీనియా పొగాకును క్యూరింగ్‌ చేసుకోవచ్చు. క్యూరింగ్‌ పూర్తయిన తర్వాత 4, 5 గంటల్లో బ్యారన్‌ వాటర్‌ ద్వారా ఆకుకు సరైన పదును అందించి అన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆకు లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు సంబంధించి 50 శాతం కూలీల ఖర్చు కలిసి వస్తుంది. అలాగే వర్జీనియా పొగాకు క్యూరింగ్‌కు పట్టే పుల్లల వినియోగం కూడా సగం వరకు తగ్గుతుంది. ఆకు అల్లడం, సరైన పద్ధతిలో ఆకును దించడం వల్ల చూర (పొడి) ఉత్పత్తి తగ్గి, ఆకు వృథా అరికట్టబడి రైతుకు సుమారు రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. మొత్తంగా వర్జీనియా క్యూరింగ్‌ ఖర్చు 50 శాతం తగ్గుతుందని, పూర్తి స్థాయి సామర్థ్యంతో క్యూరింగ్‌ చేస్తే సీజన్‌కు రూ. లక్ష వరకు లాభం వస్తుందని రైతులు చెబుతున్నారు.

నాణ్యమైన పొగాకు దిగుబడి

లూజ్‌ లీఫ్‌ బ్యారన్‌ ద్వారా క్యూరింగ్‌ చేస్తే నాణ్యమైన దిగుబడి వస్తుంది. నిర్దేశిత ఉష్ణోగ్రతల వద్ద మొదట పుల్లలతో పొగాకు క్యూరింగ్‌ చేస్తారు. ఆటోమేటిక్‌ సెన్సార్ల ద్వారా విద్యుత్‌ మోటార్లు, ఫ్యాన్లు, బ్లోయర్లు పనిచేసి ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులను క్రమబద్ధీకరిస్తాయి. ఈ విధానం వల్ల బ్యారన్‌లో పొగాకు నిరంతరాయంగా సమ ఉష్ణోగ్రతలో క్యూరింగ్‌ అవుతుంది. ఈ బ్యారన్‌ను మెటల్‌తో నిర్మించడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉండదు. తోటల్లో కోసిన పొగాకు ఆకులను మెటాలిక్‌ ట్రేలలో అమర్చి, వాటిని బ్యారన్‌ లోపలి స్టాండ్లలో ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా క్యూరింగ్‌ కూలీల ఖర్చు బాగా తగ్గుతుంది. గతంలో ఆకును గుర్రాలపై పురికోసతో, కర్రలతో కట్టి అల్లి బ్యారన్‌కు ఎక్కించేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదని, లూజ్‌ లీఫ్‌ బ్యారన్‌లో ఉడికించిన పొగాకును నేరుగా గ్రేడింగ్‌ చేసుకోవచ్చని రైతులు అంటున్నారు.

నేను 130 ఎకరాల వరకు పొగాకు పంట పండిస్తున్నాను. ఆకు కోయడానికి, కట్టడానికి, క్యూరింగ్‌కు ఎక్కించడానికి చాలా అవస్థలు పడేవాడిని. క్యూరింగ్‌ అయిన తర్వాత గ్రేడింగ్‌కు కూడా ఎక్కువ మంది కూలీలు అవసరమయ్యేవారు. అయితే గత ఏడాది నుంచి లూజ్‌ లీఫ్‌ బ్యారన్‌ను ఏర్పాటు చేసుకున్నాను. ఈ బ్యారన్‌లో 2 లోడ్ల పొగాకు ఒక్కసారిగా క్యూరింగ్‌ అవుతుంది. 50 శాతం వరకు కూలీల ఖర్చు తగ్గడంతో పాటు, నాణ్యమైన పొగాకు వస్తోంది.

– సయ్యద్‌ బాజీ, పొగాకు రైతు, అచ్చియ్యపాలెం, బుట్టాయగూడెం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement