దెందులూరు: బాలికను మోసం చేసి, కులం పేరుతో దూషించిన పోక్సో కేసులో నిందితుడైన చల్లపల్లికి చెందిన రంగ తేజ అలియాస్ రంగబాబును ఆదివారం నూజివీడు డీఎస్పీ ప్రసాద్ అరెస్ట్ చేశారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపారు.
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీతో పాటు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. సమీప జిల్లాల నుంచి విచ్చేసిన వేలాది మంది భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి, నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ.. ఒక్క ఆదివారం రోజునే ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.1,74,384 ఆదాయం వచ్చిందని తెలిపారు.
కొయ్యలగూడెం: సాగునీటి చెరువులలో నీరు తగ్గడంతో మట్టి తోలకాలు ఊపందుకున్నాయి. జేసీబీలు ఏర్పాటు చేసుకుని రాత్రి వేళల్లో రహస్యంగా అక్రమార్కులు మట్టి తోలకాలు చేస్తుండగా, పగటివేళల్లో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి మట్టిని ట్రక్కుల్లోకి రవాణా చేస్తున్నారు. చెరువు గట్లు సైతం కోతకు గురవుతుండటంతో వరద సమయాల్లో పొలాలు ముంపు బారిన పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో అధికారుల పర్యవేక్షణ ఉండదనే ధీమాతో పట్టపగలే మట్టిని లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తున్నారు. భారీ గోతులు తవ్వడం వల్ల పశువులు వాటిలో పడి ప్రమాదాల బారిన పడుతున్నాయని రైతులు అంటున్నారు. దిప్పకాయలపాడు రాజు చెరువు, కిచ్చప్పగూడెం భీముడు చెరువు, యర్రంపేట పులపాకుల చెరువు, రాజవరం పెద్ద చెరువు, సరిపల్లి హుకుంపేట చెరువుల నుంచి నిత్యం వందలాది ట్రక్కుల మట్టి కమర్షియల్ అవసరాలకు తరలిపోతోందని రైతులు ఆరోపిస్తున్నారు.


