ద్వారకాతిరుమల: కోకో గింజలకు ధర పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, రైతుల వద్ద ఉన్న కోకో గింజల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండలంలోని పంగిడిగూడెంలో కోకో తోటలను ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కోకో గింజల కొనుగోలు సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలకు రాష్ట్ర ప్రభుత్వమే ధర ఫార్ములా ప్రకటించి ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గిందనే పేరుతో కోకో గింజలకు కంపెనీలు ధర తగ్గించేయడం దారుణమన్నారు. గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ ధర కిలో కోకో గింజలకు రూ. 900 లు ఉన్నప్పుడు, ఆ ధరను కంపెనీలు రైతులకు చెల్లించలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కిలో కోకో గింజలకు రూ. 300 లు కంపెనీలు ధర ప్రకటించినా, రైతుల నుంచి గింజలు కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ ధరను మరింత తగ్గించి, మోసం చేసే విధంగా కంపెనీలు సిండికేట్‌గా మారి రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ధరల పాలసీపై మౌనంగా ఉండడం వల్ల కంపెనీలు రైతులను మరింతగా దోపిడీ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, కోకో రైతుల సంఘం నాయకులు రుద్రరాజు సుబ్బరాజు, కనుమూరి బాపిరాజు, వీరవల్లి పండు, వీరవల్లి శివ నాగరాజు, వీరవల్లి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


