మండవల్లి: రొయ్యల చెరువుల వద్ద మోటార్లు చోరీ చేస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 27 మోటార్లు, ఒక బ్యాటరీ, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల కొందరి రొయ్యల చెరువుల వద్ద మోటార్ల దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఎస్పీ కె ప్రతాప్‌శివకిషోర్, డీఎస్పీ డి శ్రావణ్‌కుమార్, సీఐ వి రవికుమార్ ఆదేశాల మేరకు పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గున్ననపూడి శివారులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని ఎస్సై రామచంద్రరావు అదుపులోకి తీసుకుని విచారించారు. మోటార్ల చోరీలో నిందితులుగా కర్రె మెక్‌మిలన్, కర్రే వంశీ, పంతగాని సంజయ్‌కుమార్, నీలం ధర్మయ్యలను గుర్తించి అరెస్ట్ చేశారు. వారినుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.


