యలమంచిలి: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై యద్ధం చేస్తుండడంతో ఆ ప్రభావం మన వంటింటిపై కూడా పడింది. యుద్ధ ప్రభావం వలన మన దేశంలో గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో చాలామందికి గ్యాస్ బుకింగ్ కాకపోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీంతో బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తలు, ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. దీంతో కొందరు ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే, మళ్లీ కొత్తగా బుక్ చేసుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ కోసం కిలోమీటర్ల మేర జనం క్యూ కడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ దొరుకుతుందా లేదా అని ఆలోచించేకంటే, ఇంట్లో ఉన్న గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవడం చాలా మంచిది.
అసలు బరువెంత
చాలా మంది వినియోగదారులకు దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ అసలు బరువు గురించి తెలియదు. సరిగ్గా నింపిన సిలిండర్ బరువు దాదాపు 29.7 కిలోలు ఉంటుంది. ఇందులో 14.2 కిలోల గ్యాస్ కాగా 15.5 కిలోల ఖాళీ సిలిండర్ బరువు ఉంటుంది. డెలివరీ సమయంలో సిలిండర్ బరువు దీని కంటే తక్కువగా ఉంటే సీలింగ్ చేసే ముందు తక్కువ గ్యాస్ నింపబడిన లేదా తీసివేయబడిన స్కామును ఇది సూచిస్తుంది.
గ్యాస్‌ను సేవ్ చేసే చిట్కాలు
● వంటకు ఉపయోగించే వంట పాత్రల రకం కూడా గ్యాస్ వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. వంట చేసేటప్పుడు, ఎల్లప్పుడూ అడుగున చదునుగా ఉన్న పాత్రలను ఎంచుకోవాలి. ఈ పాత్రలు బర్నర్‌పై సరిగ్గా కూర్చుంటాయి, తద్వారా గ్యాస్ వేడి నేరుగా పాత్రను చేరుతుంది. పాత్ర అడుగు భాగం వంకరగా ఉంటే వేడి వ్యాపించడం వలన గ్యాస్ వినియోగం పెరుగుతుంది.
● అధిక వేడి మీద వంట చేయడం వల్ల ఆహారం త్వరగా ఉడుకుతుందని, గ్యాస్ వినియోగం తగ్గుతుందని అనుకుంటారు. అయితే, ఇది చాలా తప్పు. చాలా కూరగాయలు, పప్పులు, బియ్యం మీడియం లేదా తక్కువ వేడి మీద మరింత సులభంగా, సమర్థవంతంగా వండవచ్చు, దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది.
● వంట చేయడానికి వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించడం మేలు. ప్రెషర్ కుక్కర్లో ఆహారం తక్కువ సమయంలోనే ఉడుకుతుంది. ఇది గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
● వంట చేసేటప్పుడు పాత్రల మీద మూత పెట్టడం కూడా మంచి అలవాటు. మూత లేకుండా వంట చేయడం వల్ల ఆవిరి బయటకు వెళ్లి వంట ఆలస్యం అవుతుంది.
● బర్నర్ శుభ్రతపై కూడా శ్రద్ధ వహించాలి. బర్నర్ రంధ్రాలు మూసుకుపోయినా లేదా ధూళి పేరుకుపోయినా, గ్యాస్ సరిగ్గా మండదు, ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. అందువల్ల వారానికి ఒకసారి బర్నర్ను శుభ్రం చేసుకోవడం మంచిది.


