నరసాపురం రూరల్: పసికందును అత్యవసర చికిత్స నిమిత్తం తరలిస్తున్న అంబులెన్స్ ఆవును ఢీకొంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సయ్యద్ హమీద్ మౌలా ఖాదీ, సయ్యద్ మహబూబ్ సుల్తానా దంపతులకు జనవరి 30న ఒక బాబు జన్మించాడు. ఆ బాబుకు గుండె సంబంధిత సమస్య ఉండటంతో ఆపరేషన్ నిమిత్తం తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అనంతరం, బాబు పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యుల సూచన మేరకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బాబును అంబులెన్స్‌లో కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యలో బుధవారం వేకువజామున మొగల్తూరు మండలం కొత్తోట గ్రామానికి వచ్చేసరికి జాతీయ రహదారిపై అడ్డుగా ఉన్న ఆవును అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ ముందుబాగం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ అంబులెన్స్‌లో ఉన్న వారంతా క్షేమంగా బయటపడ్డారు. బాబును 108 అంబులెన్స్‌లోకి మార్చి సురక్షితంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు క్షేమంగా ఉన్నాడని, కాకినాడ ఆసుపత్రిలో తదుపరి వైద్యం అందుతోందని సమాచారం.


