కై కలూరు: అరుదైన వ్యాధితో బాధపడుతోంది ముదినేపల్లి మండలం గురజకు చెందిన పదేళ్ల వయసు గల బాలిక భైరవపట్నపు సుప్రియ. తండ్రి ఏసుబాబు లారీ డ్రైవర్ కాగా తల్లి రాజేశ్వరీ హోటల్‌లో పనిచేస్తోంది. సుప్రియ చిన్ననాటి నుంచి వెన్నుపూస సమస్యతో బాధపడుతూ ఎడమ కాలు స్పర్శ కోల్పోయింది. అరికాలి కింద చిన్న రంధ్రం ఏర్పడటం అది పెద్దది కావడంతో కాలు నుంచి రక్తం, చీము కారడం పరిపాటిగా మారింది. ఇప్పటికే శరీరంలో ముక్కలను తీసి మూడు సార్లు కాలికి చికిత్స చేసినా ప్రయోజనం లేదు. పైగా ఇప్పుడు కుడికాలుకి సైతం స్పర్శ కోల్పోతుంది. గుంటూరు మెడికల్ కాలేజీ ఫాథాలజీ డిపార్డుమెంటు చికిత్స చేసినా నయం కాలేదు. కాలు తొలగించడం తప్పదని వైద్యులు చెబుతున్నారు. ఆర్థిక స్థోమత సహకరించకపోయినా ఇప్పటికే సుప్రియ తలిదండ్రులు అప్పులు చేసి రూ.12 లక్షలు ఖర్చు చేశారు. అలాగే ప్రతి నెలా మందుల నిమిత్తం రూ.8 వేలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అరుదైన వ్యాధి కావడంతో పథకాలు వర్తించడం లేదు. సుప్రియకు 2023లో సదరం క్యాంపులో 63 శాతం శాశ్వత అంగవైకల్యంతో ధ్రువపత్రం అందించారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం సుప్రియకు పింఛన్ మంజూరు చేయలేదు. దాతలు స్పందించి తమ కుమార్తె శస్త్రచికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని, ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయించాలని సుప్రియ తల్లిదండ్రులు కోరుతున్నారు.


