● పాముకాటుతో బాలుడి మృతి
● చేతబడి చేశాడని వ్యాపారిపై అనుమానం
● మరునాడే గొంతు కోసిన బాలుడి తండ్రి
వేలేరుపాడు: తన కొడుకు మరణానికి చేతబడి చేశాడనే అనుమానంతో వ్యాపారిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. ఈ ఘటన వేలేరుపాడు మండలం జిన్నెలగూడెంలో చోటుచేసుకుంది. గ్రామంలోని గిరిజన బాలుడు మూడేళ్ల ధనుష్ మంగళవారం మధ్యాహ్నం నాగుపాము కాటుకు గురై మృతి చెందాడు. అయితే ఆ బాలుడు మరణానికి గ్రామంలో చిరు జామాయిల్ వ్యాపారి కరెడ్ల రాజబాబు చేతబడి చేశాడని, అందువల్లనే తన కుమారుడు మరణించాడని ధనుష్ తండ్రి రవి అనుమానించాడు. దీంతో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న రాజబాబుపై రవి దాడి చేసి కత్తితో గొంతును కోసి పరారయ్యాడు. అనంతరం గ్రామస్తులు గాయాలతో ఉన్న రాజబాబును వేలేరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై నవీన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.


