భూసేకరణ వేగిరపర్చాలి
ఏలూరు(మెట్రో) : జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి సోమవారం పోలవరం ప్రాజెక్టు ఆర్‌అండ్‌ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణం, సెల్‌ఫోన్ నెట్‌వర్క్ టవర్ల ఏర్పాటు, ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు నిమిత్తం భూసేకరణపై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
భీమవరం: చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి నాయకుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయని, ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజినీ, జోగి రమేష్‌లపై దాడులను ఖండిస్తూ సోమవారం రాయలం గ్రామంలోని వెంకటరాయుడు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజాసమస్యలను గాలికి వదిలి వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులే పరమావిధిగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని నిగ్గుతేలడంతోపాటు విశాఖలో కోట్లాది రూపాయల వి లువ చేసే భూములను అప్పనంగా ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడికి కట్టబెట్టడం వంటి వ్యవహారాల్లో కూటమి పార్టీలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో భయాందోళనలు కలిగించి కూటమి నేతలు లబ్ధి పొందాలని చూస్తున్నారని, అయితే దాడులు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులకు నిరసనగా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం భీమవరం డీఎస్పీ రఘు వీర్‌విష్ణును కలిసి వినతిపత్రం అందజేశారు.
తాడేపల్లిగూడెం రూరల్: గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం అమలు చేసిన నవరత్నాలు పథకాల ద్వారా లబ్ధి పొందిన యువతి గ్రూప్–1 పరీక్షల్లో సత్తాచాటింది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ విభాగంలో కొలువు సాధించింది. పెదతాడేపల్లికి చెందిన జాలాది రమ్యశ్రీ గత ప్రభుత్వం అందించిన విద్యాదీవెన సాయం ద్వారా బీటెక్ పూర్తిచేసింది. గ్రూప్–1 పరీక్ష సన్నద్ధతకు అవసరమైన ఆర్థిక సాయాన్నీ నాటి జగన్ ప్రభుత్వం అందించింది. దీంతో గ్రూప్–1 పరీక్షల్లో ప్రతిభ కనబర్చింది. ఆమె తండ్రి కుటుంబరావు ప్రైవేట్ డ్రైవర్ కాగా తల్లి సునీత అంగన్‌వాడీ టీచర్. అక్క మౌనిక వెల్లమిల్లి ఆర్‌ఎస్‌కేలో వీఏఏగా, మరో సోదరి మనీష హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. రమ్య శ్రీ పెదతాడేపల్లి శ్రీరామా విద్యానికేతన్ పూర్వ విద్యార్థిని కాగా ప్రిన్సిపాల్ ఎ.వీరవెంకటసుబ్బరాజు ఆమెను అభినందించారు.
భీమవరం(ప్రకాశం చౌక్): విద్యుత్ మీటర్ రీడర్లు సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ధర్నా చేయడంతో రెండు రోజులుగా జిల్లాలో విద్యుత్ మీటర్ల రీడింగ్ నిలిపోయింది. జిల్లాలో సుమారు 500 మంది మీటర్ రీడర్లు ఉన్నారు. భీమవరం డివిజన్‌లో 2,09,970, నరసాపురం డివిజన్‌లో 2,24,354, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 2,19,440 మొత్తంగా 6,53,764 సర్వీసులకు సంబంధించిన బిల్లింగ్ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో శ్లాబ్ రేట్లు మారి బిల్లులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వినియోగదారులు అంటున్నారు.
భీమవరం: సమస్యల పరిష్కారం కోసం పోలీసులను ఆశ్రయించే బాధితులకు పోలీసు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి వారికి అండగా నిలవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమవారం భీమవరం వన్‌టౌన్ పోలీసుస్టేషన్ వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించి ఆయా స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వినతులు సమగ్రంగా పరిశీలించి శాత్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ రఘువీర్‌విష్ణు తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణ వేగిరపర్చాలి


