ఉండిలో వ్యక్తిది హత్యా? ఆత్మహత్యా?
ఉండి : ఉండిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అది హత్యా లేక ఆత్మహత్యా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా వున్నాయి. ఉండి రైల్వే స్టేషన్ వెనుకభాగంలో వరిచేను పరిశీలించేందుకు వచ్చిన రైతు పొలం పక్కనే వున్న పంటబోదెలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో ఉండి ఎస్సై ఎండీ నసీరుల్లా, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ల ఆధారంగా అతను ఉండి నియోజకవర్గంలోని పాలకోడేరు మండలం మోగల్లు శివారు గుత్తులవారిపాలెం ప్రాంతానికి చెందిన కడలి సుబ్బారావు(49)గా గుర్తించారు. అయితే మృతుని కంటిపై, గుండెలపై గాయాలు ఉండడంతో ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతడు ఆదివారం మధ్యాహ్నం మృతి చెంది ఉండవచ్చిన సీఐ తెలిపారు. సుబ్బారావు మృతి చెందిన ప్రాంతం ఓ కొబ్బరితోట కావడం, అది కూడా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉండటంతో ఇది హత్య అనే కోణంలో కూడా అనుమానిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి ఘటనాస్థలం నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నివేదిక అందిన తరువాత మృతిపై వివరాలు తెలియజేస్తామని సీఐ తెలిపారు.
ఉండిలో వ్యక్తిది హత్యా? ఆత్మహత్యా?


