ట్రాన్స్‌ఫార్మర్‌లలో రాగి వైరు చోరీ
జంగారెడ్డిగూడెం: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లను పగులగొట్టి రాగివైరు చోరీ చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం మండలంలోని పేరంపేట గ్రామంలో రైతులు సింహాద్రి యుగంధర్‌రెడ్డి, గోలి రవీంద్రప్రసాద్ రెడ్డికి చెందిన పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లను పగులగొట్టి రాగివైరు చోరీ చేశారు. దీనిపై ఏపీఈపీడీసీఎల్ ఏఈ వనం వెంకటేష్ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు స్టేషన్ రైటర్ పి.బాబూరావు తెలిపారు.
జంగారెడ్డిగూడెం: అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం (అక్టోబర్ 5)కు సంబంధించి గురుదేవోభవ నేషనల్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఆర్.కృష్ణయ్య, మల్కాజ్ గిరి డీఎస్పీ ఎస్.వెంకటరమణ పాల్గొని బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణం రామచంద్రాపురానికి చెందిన ఎంపీపీఎస్ హెచ్‌ఎం తుమ్మల నిర్మల అవార్డును అందుకున్నారు. ముఖ్య అతిథులు ప్రశంసాపత్రం, షీల్డ్‌తో నిర్మలను సత్కరించారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిని ప్రోత్సహించేలా అవార్డును అందించడం ఆనందంగా ఉందన్నారు.
కొయ్యలగూడెం: అంకాలగూడెం గ్రామంలోని తాళం వేసి ఉన్న ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. బాధితురాలు కాసాని లక్ష్మీకుమారి తెలిపిన వివరాల ప్రకారం సమీపంలోని వాటర్ ప్లాంట్‌లో పనిచేయడానికి ఉదయం ఇంటికి తాళం వేసి వెళ్లింది. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.5 లక్షల నగదు, పదికాసుల బంగారం కనింపించలేదు. దీంతో బాధితురాలు లక్ష్మీకుమారి చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


