
చింతలపూడి ఇసుక పంచాయితీ
లారీ ఓనర్స్ అసోసియేషన్ ఫిర్యాదు
పేరేమో చింతలపూడిది.. ఇసుక తరలివెళ్లేది మాత్రం తెలంగాణకు.. ఇసుక సిండికేట్‌కు, తెలంగాణ నుంచి వచ్చే అక్రమ లారీ సిండికేట్ మధ్య జరిగిన చీకటి ఒప్పందానికి చింతలపూడి లారీ యజమానులు బలయ్యారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తెలంగాణకు కొవ్వూరు నుంచి వెళ్లే ప్రతి ఇసుక లారీ చింతలపూడి అన్‌లోడింగ్ పేరిట బిల్లు తీసుకుని అక్రమ దందా తారాస్థాయిలో కొనసాగిస్తున్న క్రమంలో చింతలపూడి పరిధిలోని లారీలకు రీచ్‌ల నుంచి ఇసుక ఇవ్వబోమని తేల్చిచెప్పడంతో వివాదం రేగింది. లారీ యజమానులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
యథేచ్ఛగా ఇసుక దందా
కొవ్వూరు నియోజకవర్గంలోని కొవ్వూరు, తాళ్లపూడి, పంగిడి, కుమారదేవంలో ఇసుక రీచ్‌ల నుంచి చింతలపూడి లారీలకు ఇసుక ఇవ్వడానికి ర్యాంప్ సిండికేట్లు నిరాకరిస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గానికి గత రెండు నెలల్లో 1.42 లక్షల టన్నుల ఇసుకను తరలించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారిక లెక్కలు మాత్రం చింతలపూడి మీదుగా ఖమ్మం జిల్లాకు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు భారీగా ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ప్రధానంగా 25 లారీల్లో నిత్యం తెలంగాణకు కొవ్వూరు నియోజకవర్గం నుంచి అక్రమంగా ఇసుక తరలివెళ్తోంది. కొవ్వూరు స్థానిక ప్రజాప్రతినిధిని శాసించే త్రిసభ్య కమిటీయే ఇసుక దందా సిండికేట్. అన్ని రీచ్‌లు త్రిసభ్య కమిటీలో ఉన్న ముగ్గురే శాసించడం, ప్రజాప్రతినిధికి కూడా ట్రాక్టర్ మొదలుకొని లారీ వరకు ఒక్కొక్క ధర నిర్ణయించి చెల్లించి పూర్తిగా హవా సాగిస్తున్నారు. సదరు త్రిసభ్య కమిటీ తెలంగాణాకు భారీగా తరలిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇలా చింతలపూడి మండలం అల్లిపల్లి సరిహద్దు గ్రామం మీదుగా తెలంగాణకు తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు నెలల వ్యవధిలో మైనింగ్ శాఖ పూ ర్తిగా మౌనం వహించడంతో పోలీసులు అతికష్టం మీద 25 వాహనాలను సీజ్ చేయడం, రెండు, మూడు రోజుల వ్యవధిలో వాహనాలను తీసుకువెళ్లడం జరిగింది. దీనిపై కలెక్టర్‌కు వరుస ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ అల్లిపల్లి వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణతో రెవెన్యూ చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. అయినా ఇసుక దందాకు అడ్డుకట్ట పడలేదు. చెక్‌పోస్టులో ఉన్న వీఆర్‌ఓను బెదిరించి మరీ ఇసుకను తరలించడంతో వీఆర్‌ఓ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయినా రోజూ 10 నుంచి 15 లారీలు అక్రమంగా తరలివెళ్తున్నాయి. ఒక్కో లారీ నుంచి రెవెన్యూ సిబ్బంది రూ.వెయ్యి నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక గత వారం నుంచి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చింతలపూడి మండలానికి ఇసుక ఇవ్వడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ లారీల ముఠా ఏలూరు, కామవరపుకోట, చాట్రాయి మండలాల పేరిట బిల్లులు కొట్టించి యథావిధిగా ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈనెల 8న చింతలపూడికి చెందిన శ్రీ ఆంజనేయ లారీ ఓనర్స్ అసోసియేషన్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అసోసియేషన్ పరిధిలో 120 లారీలున్నాయని, కొవ్వూరు నియోజకవర్గం ఇసుక ర్యాంపుల్లో లోడింగ్ చేయమని తమకు ఆదేశాలున్నాయని చెప్పి చింతలపూడి వాహనాలకు ఇసుక ఇవ్వడం లేదని ఫిర్యాదులో వివరించారు. అలాగే ఆంధ్రా నుంచి తెలంగాణకు అల్లిపల్లి రెవెన్యూ చెక్‌పోస్టు మీదుగా రోజూ 15 లారీలకుపైగా అక్రమంగా ఇసుక వెళ్తుందని, అక్కడ సిబ్బందికి సొమ్ములు ఇచ్చినట్లు లారీ ఓనర్లే చెబుతున్నారని, ప్రతి వాహనానికి ఏర్పాటు చేసిన మైనింగ్ జీపీఎస్, సీసీ కెమెరాల ద్వారా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, అలాగే తమకు ఉపాధి కల్పించాలని, లేదంటే ఈఎంఐలు చెల్లించలేక లారీ యజమానులు అప్పులపాలవుతున్నారని తెలిపారు. అలాగే అక్రమ రవాణా చేస్తున్న 25 లారీ నంబర్లను కూడా కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం విశేషం.
ఇసుక.. మస్కా
చింతలపూడి లారీలకు కొవ్వూరులో నో ఇసుక
తెలంగాణ లారీలకు అదనంగా రూ.100 వసూలు
రోజూ 15 లారీలు తెలంగాణాకు..
చింతలపూడి అన్‌లోడింగ్ పేరుతో తెలంగాణకు అక్రమ దందా
నష్టపోతున్నామంటూ లారీ యజమానుల ఆవేదన
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వైనం

చింతలపూడి ఇసుక పంచాయితీ