
మడుగుల్లా రోడ్లు.. ప్రయాణానికి పాట్లు
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరంలోని పలు వీధుల్లో రోడ్లు భారీ గోతులు, వర్షం నీటితో మడుగులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం గోతులు పూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టడం లేదు. వర్షాలు కురుస్తుండటంతో రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు అవకాశం లేదని అధికారులు తప్పించుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు రోడ్ల బాగోగులపై పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పట్టణంలోని పలుచోట్ల పైప్‌లైన్ లీకేజీలతో తాగునీరు వృథా అవుతోంది. ఇలా పట్టణంలో 10 నుంచి 15 చోట్ల భారీ లీకేజీలు ఉన్నా మున్సిపల్ వాటర్ విభాగ అధికారులు పట్టించుకోవడం లేదు. దీని వల్ల తాగునీరు వృథాతో పాటు రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని పట్టణవాసులు అంటున్నారు.
జాతీయ రహదారిపై అధ్వానంగా..
భీమవరం: భీమవరం నుంచి ఉండి వైపునకు వెళ్లే జాతీయ రహదారిపై పలుచోట్ల గుంతలు పడటం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. అయి తే అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులే పలుచోట్ల స్వచ్ఛందంగా కర్రలకు సంచులు కట్టి హెచ్చరికలు ఏర్పాటుచేశారు. గుంతలు పూ డ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.