అంగన్‌వాడీలు, పాఠశాలల్లో పరేషన్‌ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలు, పాఠశాలల్లో పరేషన్‌

Oct 10 2025 6:30 AM | Updated on Oct 10 2025 6:32 AM

పిల్లలను పస్తులుంచొద్దు

సమస్య పరిష్కారానికి కృషి

పట్టించుకోని ఇన్‌చార్జి మంత్రి

కై కలూరు: కూటమి పాలనలో నిత్యవసరాల పంపిణీ వ్యవస్థ గాడి తప్పుతోంది. సకాలంలో సరుకులు అందక అంగన్‌వాడీ చిన్నారులు, పాఠశాలల విద్యార్థులు చాలీచాలని ఆహారంతో, ఖాళీ కడుపులతో కాలం వెళ్లదీస్తున్నారు. అక్టోబర్‌ నెల వచ్చి 10 రోజులు కావస్తున్నా ఇంకా అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలకు రేషన్‌ సరఫరా లేదు. ఆన్‌లైన్‌ సర్వర్‌లో మార్పులు ఆలస్యానికి కారణమని సివిల్‌ సప్లయిస్‌ అధికారులు చెబుతోన్నారు. అంగన్‌వాడీ సెంటర్లలో నిల్వలు నిండుకోవడంతో రేషన్‌ దుకాణాలు చుట్టూ అంగన్‌వాడీ టీచర్లు తిరుగుతున్నారు.

ఇదీ పరిస్థితి

ఏలూరు జిల్లాలో 2,226 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 48,563 మంది, 3వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వరకు పిల్లలు 23,499 మంది, గర్భిణులు 8,861 మంది, బాలింతలు 6,592 మంది, యుక్తవయస్సు బాలికలు 21,498 మంది ఉన్నారు. అదే విధంగా జిల్లాలో 1,818 ప్రభుత్వ పాఠశాలల్లో 1,22,790 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం అంగన్‌వాడీలకు బియ్యం, కందిపప్పు, నూనె, పిండి, గుడ్లు, పాలు వంటివి సరఫరా చేయాల్సి ఉంది. సరుకుల ఆలస్యం వల్ల పదేపదే గర్భిణులు, బాలింతలు కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజనం పథకంలో పాత నిల్వలతోనే నిర్వాహకులు వంట చేస్తున్నారు.

కాంట్రాక్టర్ల గగ్గోలు..

ఏలూరు జిల్లాలో ఏలూరు, కై కలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, కోట రామచంద్రాపురం, పాతూరు, ధర్మాజీగూడెం, కుక్కనూరులో మండల లెవెల్‌ స్టాక్‌ పాయింట్‌(ఎంఎల్‌ఎస్‌పీ) ఉన్నాయి. సెంట్రల్‌ వేర్‌ హౌస్‌ కార్పొరేషన్‌(సీడబ్ల్యూసీ) నుంచి సరకును స్టేజ్‌–1 కాంట్రాక్టర్లు ఎంఎల్‌ఎస్‌పీకి సరఫరా చేస్తారు. ఎంఎల్‌ఎస్‌పీ నుంచి రేషన్‌ దుకాణాలకు స్టేజ్‌–2 కాంట్రాక్టర్లు చేరవేస్తారు. వీరికి రెండు నెలలుపైబడి బిల్లులు రాలేదు. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగులకు సైతం సకాలంలో జీతాలు రావడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల వద్దకు నేరుగా సరుకుల సరఫరా చేస్తామని చెబుతున్నా అమలులో అది సాధ్యం కావడం లేదు. ఇదిలా ఉంటే 50 కేజీల బస్తాలలో ఇప్పటికే బియ్యం కొంత తగ్గుతున్నాయని రేషన్‌ డీలర్లు వాపోతున్నారు.

అంగన్‌వాడీ సెంటర్లలో కార్యకర్తలు సొంత డబ్బులతో సరుకులు కొంటున్నారు. ఇప్పటి వరకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సరుకుల సరఫరా చేయలేదు. నిత్యవసర సరుకుల కోసం పదేపదే కార్యకర్తలు డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి నెలా సమయానికి నిత్యవసరాలను సరఫరా చేయాలి.

– డీఎన్‌వీడీ.ప్రసాద్‌, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌(సీఐటీయూ) జిల్లా గౌరవాధ్యక్షుడు

అంగన్‌వాడీ కేంద్రాలకు నిత్యవసర సరుకుల పంపిణీ కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంగన్‌వాడీ కార్యకర్తలు చర్యలు తీసుకుంటున్నారు. సమస్య త్వరలోనే పరిష్కారమవుతుంది.

– పి.శారద, ఐసీడీఎస్‌, జిల్లా పీడీ, ఏలూరు

ఏలూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ వ్యవహరిస్తున్నా జిల్లాలో సకాలంలో అంగన్‌వాడీలకు, పాఠశాలలకు సరుకుల మాత్రం చేరడం లేదు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో బియ్యం తూకంపై నిఘాను ముమ్మరం చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ సమస్యపై కై కలూరు సివిల్‌ సప్‌లై డీటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో స్టేట్‌, సెంట్రల్‌ రెండు సైట్‌లు ఉండేవని, రెండు సర్వర్‌లను కలిపి సింగిల్‌ విండోగా తీసుకొస్తున్నారని చెప్పారు. దీని వల్ల రిలీజ్‌ ఆర్టర్‌(ఆర్వో)ల సమస్య వచ్చిందన్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కావచ్చని తెలిపారు.

ఇంకా చేరని నిత్యావసరాలు

ఆన్‌లైన్‌ మార్పులతో ఆర్‌వోలు ఆలస్యం

అప్పులు చేసి అంగన్‌వాడీల నిర్వహణ

జిల్లాలో 2,226 అంగన్‌వాడీలు,

1,818 పాఠశాలల్లో అవస్థలు

అంగన్‌వాడీలు, పాఠశాలల్లో పరేషన్‌ 1
1/3

అంగన్‌వాడీలు, పాఠశాలల్లో పరేషన్‌

అంగన్‌వాడీలు, పాఠశాలల్లో పరేషన్‌ 2
2/3

అంగన్‌వాడీలు, పాఠశాలల్లో పరేషన్‌

అంగన్‌వాడీలు, పాఠశాలల్లో పరేషన్‌ 3
3/3

అంగన్‌వాడీలు, పాఠశాలల్లో పరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement