
అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
ఏలూరు టౌన్: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త కత్తెరతో ఆమెను కడతేర్చిన ఘటన ఏలూరు పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతలపూడి మండలం సీతానగరం ప్రాంతానికి చెందిన కంతేటి నరేష్‌కు, నాగలక్ష్మి (34)కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. భర్త నరేష్ తాపీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నరేష్ తన కుటుంబంతో పాటు ఏలూరు శనివారపుపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంతానికి మకాం మార్చివేశాడు. భర్త నరేష్ ఏలూరులో కూడా తాపీ పనులు కొనసాగిస్తూ ఉండగా, భార్య నాగలక్ష్మి కొంతకాలం కర్రీ పాయింట్ పెట్టి, అనంతరం మెషీన్ కుడుతూ కుటుంబ పోషణలో భర్తకు తోడుగా ఉంటుంది. కానీ గత కొంత కాలంగా భర్త నరేష్ తన భార్య వేరొకరితో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. ఇక అనుమానం కాస్త కక్షగా మారి ఇంటి వద్దనే మిషన్ కుడుతున్న భార్యపై ఆకస్మికంగా కత్తెరతో దాడి చేశాడు. అతి కిరాతకంగా మెడ, తలభాగాలపై పోడిచాడు. స్థానికులు గమనించి అతడిని నిలువరించి పట్టుకునే ప్రయత్నం చేయగా, తప్పించుకుని పారిపోయాడు. తీవ్ర గాయాలతో రక్తంలో పడి ఉన్న నాగలక్ష్మిని స్థానికులు ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. కొంతసేపటికే ఆమో చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటనా స్థలాన్ని ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు పరిశీలించారు. నిందితుడు నరేష్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలిపారు.
పెనుమంట్ర: పెనుమంట్ర గ్రామాభివృద్ధికి ప్రభుత్వం, అధికారులు సహకరించడం లేదని పెనుమంట్ర గ్రామ సర్పంచ్ తాడిపర్తి ప్రియాంక, ఉప సర్పంచ్ భూపతిరాజు శ్రీనివాసరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పెనుమంట్ర సచివాలయ ఆవరణలో ‘పల్లె పల్లెకు మన పితాని’గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సర్పంచ్ ప్రియాంకును కించపరిచే విధంగా మాట్లాడడంతో వేదికపై ఉన్న సర్పంచ్ ప్రియాంక, ఉప సర్పంచ్ శ్రీనివాసరాజు ఒక్కసారిగా లేచి పితాని ప్రసంగానికి అడ్డు తగిలారు. గ్రామంలోని అధికారులు విద్యా కమిటీ సభ్యుల ఫోర్జరీ సంతకాలు చేసి, తప్పుడు తీర్మానాలతో ఇక్కడ పాఠశాలను విద్యార్థులకు దూరం చేశారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎలగల బుల్లి రామిరెడ్డి, తహసీల్దార్ వైవీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మెషీన్ కుడుతున్న భార్యపై కత్తెరతో దాడి

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త