ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Oct 10 2025 6:30 AM | Updated on Oct 10 2025 6:30 AM

ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి ఆర్జిత సేవల పునరుద్ధరణ

నేటి నుంచి ఆర్జిత సేవల పునరుద్ధరణ

ద్వారకాతిరుమల: శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు గురువారం జరిగిన పలు కార్యక్రమాలతో ముగిశాయి. ఉదయం స్వామివారి కల్యాణ మండపంలో అర్చకులు శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చనాది కార్యక్రమాలను జరిపి, హారతులిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు వసంతాలను సమర్పించి, చూర్ణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా స్వామివారిని కీర్తిస్తూ అర్చకులు, మహిళా భక్తులు వడ్లు దంచారు. ఆ తరువాత రాజాదిరాజ వాహనంపై శ్రీవారికి తిరువీది సేవను నిర్వహించి, భక్తులపై వసంతాలు చల్లారు. రాత్రి ఆలయంలో ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవాన్ని జరిపారు.

ద్వాదశ కోవెల ప్రదక్షిణలు ఇలా..

స్వామి, అమ్మవార్లకు రాత్రి ఆలయంలో 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదనలు జరిపారు. ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో సేవాకాలాన్ని నిర్వహించి, ఒక్కో రకం పిండి వంటను ఆరగింపుచేసి స్వామి, అమ్మవార్లకు హారతులిచ్చారు. వీణా, వేణువు, మృదంగం, గానం, నృత్యం, శృతి, శ్మ్రుతి, ద్రవిడ వేదం, బేరి, కాహలము, గంటారావం, నిశ్శబ్ధం వెరసి 12 సేవలు, 12 ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం జరిపిన శ్రీపుష్ప యాగోత్సవంలో అర్చకులు, పండితులు, భక్తులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే ఆలయ ముఖ మండపంలో స్వామివారు శయన మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ వేడుకలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

నేటి నుంచి ఆర్జిత సేవలు యథాతథం

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో రద్దు చేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. భక్తులు గమనించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement