
ఉధృతంగా ప్రవహిస్తున్న జల్లేరు వాగు
బుట్టాయగూడెం: మండలంలో బుధవారం రాత్రి కురిసిన వర్షంతోపాటు ఎగువన కొండప్రాంతంలో కురిసిన వర్షాలకు తోడు జల్లేరు జలాశయం డ్యామ్ నుంచి అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. గురువారం కూడా జైనవారిగూడెం– రెడ్డిగణపవరం మధ్య ఉన్న జల్లేరువారు వాగు ఉధృతంగా ప్రవహించింది. అయితే ఈ సమయంలో మండలంలోని జైనవారిగూడెంకు చెందిన ఇరపా అన్నామణి అనే గిరిజన మహిళ వాగుదాటే ప్రయత్నం చేస్తూ కొట్టుకుపోయింది. అయితే ఈ సమాచారం అందుకున్న గ్రామస్థులు తాటి రాముడు, తాటి రాంబాబు, సవలం యాకోబు, తదితరులు వాగు సమీపానికి చేరుకుని వాగు వెంబడి అన్నామణి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతూ కొంగవారిగూడెం ప్రాజెక్టు వరకూ వెళ్లారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై దుర్గా మహేశ్వరరావు, రైటర్ రాంప్రసాద్‌తోపాటు మరికొంతమంది పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకోవడంతోపాటు వారు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. వాగు వెంబడి గాలింపు చర్యలు చేస్తున్న సమయంలో వాగుకు పైభాగంలో పనిచేస్తున్న కొవ్వాసు బాబూరావు అనే రైతు అన్నామణి వాగు వెంబడి కొమ్మలు పట్టుకుని ఉన్నట్లు చెప్పారు. దీంతో హుటాహుటిన గ్రామస్తులు, పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను బయటకు తీశారు. ఎస్సై అన్నామణిని ప్రశ్నించగా తన పిల్లలు మండలంలోని వెలుతురువారిగూడెంలో ఉండగా వారిని చూసేందుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు చెప్పింది.

ఉధృతంగా ప్రవహిస్తున్న జల్లేరు వాగు