
హస్తకళలపై విద్యార్థులకు అవగాహన
బుట్టాయగూడెం: ఔత్సాహిక ఆదివాసీ, గిరిజన యువతను గుర్తించి వారికి ఉత్సాహం ఉన్న కళారంగాల్లో నిష్ణాతులైన వారితో ప్రత్యేక శిక్షణలు ఇచ్చి వెదురు వస్తువులతో వివిధ రకాల కళాకృతులను రూపొందిస్తామని డెవలప్‌మెంట్ కమిషనర్, కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ సహాయ డైరెక్టర్ ఎన్.అపర్ణలక్ష్మి అన్నారు. మండలంలోని బూసరాజుపల్లిలో గిరిజన సంక్షేమ శాఖ గురుకుల రెసిడెన్షియల్ కళాశాలలో గురువారం డెవలప్‌మెంట్ కమిషనర్, కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ ఆర్థిక సహకారంతో కోకో ట్రైబల్ ప్రోడ్యూసర్ కంపెనీ నిర్వహణలో వెదురు వస్తువుల కళాకృతులు తయారీ, ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అపర్ణలక్ష్మి మాట్లాడుతూ భారతీయ హస్తకళలపై విద్యార్థులకు అవగాహన కలిగించడానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో క్రాఫ్ట్ అవేర్‌నెస్, డిమాన్‌స్ట్రేషన్ ప్రోగామ్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. కేఆర్‌పురం ఐటీడిఏ పరిధిలో, సీతంపేట, ఒరిస్సా సరిహద్దులో ఉన్న గిరిజన యువతకు వెదురు, తాటాకులతో వస్తువుల తయారీ, సవర పెయింటింగ్‌లో నైపుణ్యం సాధించే దిశగా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం పలువురు కళాకారులకు టూల్ కిట్స్‌ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ గట్టిం మాణిక్యాలరావు, ఏపీడీ రాజబాబు, ప్రాజెక్టు డైరెక్టర్ షేడ్ ఆర్గనైజేషన్, కోకో ట్రైబుల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పీడీ సుధీర్‌కుమార్ పాల్గొన్నారు.