
వరద ముంపులో అంకాలగూడెం
కొయ్యలగూడెం: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన కాలువలు ఉధృత స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నూతి కుంట కాలువ ఉధృతికి రెండు రోజుల నుంచి అంకాలగూడెం గ్రామం జలదిగ్బంధంలో ఉంది. నూతికుంట కాలువ పూడిక తీత చేయకపోవడంతో దళితవాడ ముంపునకు గురైందని మాజీ ఉప సర్పంచ్ గర్రె వీరభద్రం తెలిపారు. రెండు రోజుల నుంచి ముంపులోనే ఉంటున్నామని అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ కన్నెత్తి చూడలేదని దళిత మహిళలు వాపోతున్నారు. తమ పిల్లల్ని పాఠశాలలకు కూడా పంపలేని స్థితిలో ఉన్నామని, బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామన్నారు. మిషనరీ హాస్పిటల్ నుంచి గణపతి ఆలయం వరకు కాలువ ఆక్రమణలకు గురి కావడమే ముంపుకు కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఏజెన్సీలో పొంగిన కొండవాగులు
బుట్టాయగూడెం: అల్పపీడన ద్రోణి కారణంగా సోమవారం ఏజెన్సీలో సుమారు గంట సేపు భారీ వర్షం కురిసింది. కొండప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాగులు పొంగిపొర్లాయి. మండలంలోని ఇప్పలపాడు సమీపంలో ఉన్న జల్లేరు వాగు, రెడ్డిగణపవరం సమీపంలోని వాగులు రెండు గంటలపాటు పొంగిపొర్లాయి. వాగులు పొంగి పొర్లడంతో పోలీసులు ఇరువైపులా భద్రతా చర్యలు చేపట్టారు. వాగులు పొంగుతున్న సమయంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

వరద ముంపులో అంకాలగూడెం