పీఆర్సీ ఊసెత్తరు.. డీఏలు చెల్లించరు | - | Sakshi
Sakshi News home page

పీఆర్సీ ఊసెత్తరు.. డీఏలు చెల్లించరు

Sep 17 2025 11:03 AM | Updated on Sep 17 2025 11:03 AM

పీఆర్సీ ఊసెత్తరు.. డీఏలు చెల్లించరు

పీఆర్సీ ఊసెత్తరు.. డీఏలు చెల్లించరు

జిల్లాలో 22 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు దుర్మార్గంగా వ్యవహరిస్తోంది పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలి

ఇప్పటికే రోడ్డెక్కిన టీచర్లు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్నికలకు ముందు పీఆర్‌సీ ఇస్తాం, మంచి ఐఆర్‌ ఇస్తాం, పెండింగ్‌ బకాయిలన్నీ విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఏడాదిన్న గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇప్పటికే అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వినతిపత్రాలు సమర్పిస్తున్నా ఎలాంటి స్పందన లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వారికి ఎలాంటి కష్టం లేకుండా సకాలంలో చెల్లింపులు చేశారు. అంతకముందు ప్రభుత్వం బకాయి పెట్టిన 3 డీఏలతో పాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న అన్ని సంవత్సరాలూ బకాయి పెట్టకుండా డీఏలు విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 డీఏలు బకాయి పెట్టింది. దీంతో పాటు వారు దాచుకున్న పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ రుణాలు కూడా మంజూరు చేయడంలేదని ఉద్యోగ, ఉపాధ్యాయులు వాపోతున్నారు. బిడ్డల చదువులకు, వివాహాల నిమిత్తం దాచుకున్న దానిలో రుణాల కింద విడుదల చేయాలని దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పీఆర్‌సీ ఊసే ఎత్తడం లేదు

డీఏ బకాయిలు విడుదల చేయకపోయినా, సరెండర్‌ లీవులు మంజూరు చేయకపోయినా కనీసం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పీఆర్‌సీ ప్రకటిస్తే తమ జీతాలు పెరుగుతాయని ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటనా విడుదల కావడం లేదు. 12వ పీఆర్‌సీ ప్రకటిస్తే కనీసం 30 శాతం ఫిట్‌మెంట్‌ లభించి సుమారు రూ.50 వేల జీతం తీసుకునే ఉద్యోగికి మరో రూ.15 వేల వరకూ పెరుగుతుందని ఆశిస్తుండగా ప్రభుత్వం పీఆర్‌సీ ప్రకటించకుండా కప్పదాటుగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పీఆర్‌సీ ప్రకటించడానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల స్థితిగతులు, అప్పటి జీవన ప్రమాణాలపై అధ్యయనం చేయడానికి పీఆర్‌సీ చైర్మన్‌ను నియమించింది. పీఆర్‌సీ కమిటీ ఛైర్మన్‌ అధ్యయనం చేస్తుండగానే ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల కష్టాలు మళ్ళీ మొదటికొచ్చాయి.

2 డీఏలు విడుదల చేయాలి

గత ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయులను ఊరడించడానికి, ప్రసన్నం చేసుకోవడానికి దసరా సమయంలోనైనా ఏదో ఒక తాయిలాలు ప్రకటిస్తూ ఉండేవి. కూటమి ప్రభుత్వం కనీసం ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. ఈ అంశం ఉద్యోగ, ఉపాధ్యాయులను మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. దసరా కానుకగా కనీసం రెండు డీఏలన్నా విడుదల చేయాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 22 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు బలయ్యారు. వీరిలో సుమారు 6,500 మంది ఉపాధ్యాయులుండగా 15,500 మంది ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, గెజిటెడ్‌ అధికారులు, నాల్గొ తరగతి ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఒక్క డీఏ బకాయిల వరకూ చూసుకున్నా సుమారు రూ. 50 – రూ. 60 కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సరెండర్‌ లీవ్‌, పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ రుణాల బకాయిల మరో రూ.150 కోట్లు ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల మంది పెన్షనర్లు కరువు భత్యం కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంతవరకూ నాలుగు డీఏలు బకాయిలు పెట్టడం దురదృష్టకరం. దసరా నాటికి కనీసం 2 డీఏ బకాయిలనైనా విడుదల చేయాలి. 3 సరెండర్‌ లీవుల బకాయిలను కూడా విడుదల చేయాలి.

– చోడగిరి శ్రీనివాస్‌, ఏపీ ఎన్‌జీఓ సంఘం

2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్‌సీ అమలు చేయాల్సి ఉంది. మాజీ ముఖ్యమంత్రి పీఆర్‌సీ చైర్మన్‌ను నియమించారు. ఈ లోపు ప్రభుత్వం మారడంతో ఆ చైర్మన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు దాటుతున్నా ఇప్పటి వరకూ పీఆర్‌సీ మాటే ఎత్తకపోవడం దురదృష్టకరం. పీఆర్‌సీ ప్రకటించే లోపు మధ్యంతర భృతి అయినా ప్రకటించి విడుదల చేయాలి.

– గెడ్డం సుధీర్‌, వైఎస్సార్‌ టీచర్స్‌

అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి

ఆందోళనలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు

ఇంత వరకూ 4 డీఏల బకాయి

దసరా కానుకగా కనీసం 2 డీఏలు విడుదల చేయాలని డిమాండ్‌

ఇప్పటికే రోడ్డెక్కిన టీచర్లు

బాకీలను వెంటనే విడుదల చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు విడివిడిగా కలెక్టర్‌ కార్యాలయాలు, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో కూడా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలకు దిగాయి. ఉపాధ్యాయ సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి పోరుబాట పట్టారు. ప్రభుత్వంలో చిన్నపాటి కదలిక కూడా లేదు. ప్రస్తుత ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎఫ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వారం నిర్వహిస్తోంది. వచ్చే అక్టోబర్‌ 7న ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఎన్‌జీఓ నాయకులు సైతం వచ్చే రెండు నెలల్లో బకాయిలన్నీ చెల్లించాలని, పీఆర్‌సీ ప్రకటించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement