
ఏజెన్సీలో భారీ వర్షం
బుట్టాయగూడెం: ఏజెన్సీలో మంగళవారం భారీ వర్షం కురిసింది. సుమారు 3 గంటలపాటు కుండపోత వర్షంతో కొండవాగులు పొంగిపొర్లాయి. రెడ్డిగణపవరం సమీపంలోని జల్లేరు వాగు ఉధృతితో ఈ రహదారిపై రాకపోకలు సుమారు 3 గంటల వరకూ నిలిచిపోయాయి. ఇప్పలపాడు సమీపంలోని జల్లేరు వాగు పొంగిపొర్లింది. బుట్టాయగూడెం శివారు అల్లి కాల్వ పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో వరదనీరు స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్, పశువుల ఆస్పత్రిలోకి ప్రవేశించాయి. శివాలయం సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఉన్న రహదారిపై నుంచి వరదనీరు ప్రవహించింది. సింగరంపాడు వద్ద ఉన్న వేరుశనగ, పామాయిల్ తోటల్లోకి కూడా వరదనీరు భారీగా చేరింది.
వర్షాలకు దెబ్బతిన్న గుమ్ములూరు రోడ్డు
బుట్టాయగూడెం: ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని గుమ్ములూరు రహదారి దెబ్బతింది. కొండవాగు పొంగిపొర్లడంతో ఆ ప్రవాహానికి రోడ్డు పాడైపోయింది. అధికారులు స్పందించి వెంటనే రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.