
రాజకీయ వేధింపులు ఆపాలి
ఏలూరు (టూటౌన్): జిల్లాలో అక్రమంగా తొలగించిన వీవోఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఆన్‌లైన్ వర్క్ పేరుతో వేధింపులు ఆపాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ వెలుగు వీవోఏ(యానిమేటర్స్), ఉద్యోగుల సంఘం(సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం జోరు వానలో ధర్నా నిర్వహించారు. వేతన బకాయిలు చెల్లించాలని, గ్రూప్ బీమా సౌకర్యం కల్పించాలని నినదించారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ధర్నాలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడి ప్రసాద్, యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాషిణి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీవోఏలను రాజకీయ వేధింపులకు గురిచేస్తూ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. యాప్స్ పేరుతో సంబంధం లేని అనేక పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.