
కై కలూరులో కొల్లి అరాచకం
7 చీటింగ్ కేసులు, 3 చెక్‌బౌన్స్ కేసులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార పార్టీ నేత కొల్లి బాబి అరాచకాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. మాజీ మంత్రి, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అండదండలతో పేట్రేగిపోతున్న బాబి దళిత ఉద్యమంతో దిగొచ్చాడు. దాడులు, దౌర్జన్యాలు, దందాలతో నిత్యం వివాదాస్పద వ్యక్తిగా ఉండే బాబి తాజాగా కై కలూరు మండలం దానిగూడెంలో దళిత యువకులపై దాడిలో కీలక వ్యక్తి. ఘటన జరిగాక పోలీసులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దళిత సంఘాలు రోడ్డెక్కి తీవ్ర ఆందోళనకు దిగాయి. కామినేని డైరెక్షన్‌లో పరారైన కొల్లి 12 రోజులు తరువాత ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయాడు. జనసేన కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి షాడో ఎమ్మెల్యే తరహాలో కై కలూరులో ప్రతి వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. కై కలూరుకు చెందిన కొల్లి వరప్రసాద్ అలియాస్ బాబి జనసేనలో క్రియాశీలక కార్యకర్తగా కొనసాగుతూ గత ఎన్నికల్లో నియోజకవర్గంలో జనసేన ఎలక్షన్ ఇన్‌చార్జిగా పనిచేశాడు. పేరుకే జనసేన అయినప్పటికీ 24 గంటలూ ఎమ్మెల్యే కామినేని వెంటే ఉంటూ దందాలు కొనసాగించాడు. గతంలోనూ కొల్లి బాబిది వివాదాస్పద వైఖరి.
దళితుల ఉద్యమంతో లొంగుబాటు
ఈ నెల 5న కై కలూరు శివారులోని దానిగూడెం దళితవాడలో ఇద్దరు యువకులపై జనసేన కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ కేసులో 8 మందిని అరెస్టుచేశారు. ప్రధాన సూత్రధారిగా ఉన్న కొల్లి బాబి.. కామినేని డైరెక్షన్‌తో పరారయ్యాడు. దళితులు రోడ్డెక్కి ఆందోళన చేయడం, సామాజిక వర్గాల పోరుగా మారడం, ఇతర ప్రాంతాల నుంచి దళిత సంఘాలు కీలక నేతలు వచ్చి పరామర్శించి పోలీసుల తీరుపై మండిపడుతున్న క్రమంలో 12 రోజులుగా పరారీలో ఉండి మంగళవారం మధ్యాహ్నం ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయాడు. లొంగిపోవడానికి ముందు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వీడియో పోస్టు చేశాడు. బయటకు వచ్చిన తరువాత కొల్లి బాబి 2.0 చూపిస్తానని, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు సంగతి తేలుస్తానంటూ బెదిరింపులకు దిగడం గమనార్హం.
కామినేని అండతో రెచ్చిపోతున్న వైనం
కూటమి అధికారంలోకి వచ్చాక దందాలు, దాడులు
దానిగూడెం దళితులపై దాడి ఘటనలో కొల్లి కీలక సూత్రధారి
12 రోజుల పరారీ తరువాత లొంగిపోయిన వైనం
కామినేని డైరెక్షన్‌తోనే పోలీసుల ఎదుట లొంగుబాటు!
బయటకు వచ్చాక కొల్లి బాబి 2.0 చూపిస్తానంటూ బెదిరింపులు
పదేళ్ళ క్రితం అటవీశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ కృష్ణా, ఏలూరు జిల్లాల్లో అటవీ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 25 మందికిపైగా మోసం చేసి డబ్బులు వసూలు చేసిన ఘటనలో అతనిపై కేసు నమోదైంది. సుమారు 7 చీటింగ్ కేసులు, 3 చెక్‌బౌన్స్ కేసులున్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఏ–2గా కొల్లి ఉన్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన సమయంలో కై కలూరులో చెలరేగిపోతాడు. గతేడాది కూటమి అధికారంలోకి రాగానే మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు హయాంలో చేసిన పనులకు సంబంధించిన శిలాఫలకాల తొలగింపుతో దౌర్జన్యకాండ మొదలుపెట్టాడు. మార్చి 27న కై కలూరు వైస్ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా భుజబలపట్నంలో ఎంపీటీసీ ఇంటి వద్ద జరిగిన ఘర్షణను చిత్రీకరిస్తున్న స్థానిక జర్నలిస్టు కురెళ్ళ కిషోర్‌పై బాబి, అతని అనుచరులు దాడి చేశారు. ఆ తరువాత టీడీపీకి చెందిన రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పైడిమర్రి మాల్యాద్రి కార్యాలయంపై జరిగిన దాడి కొల్లి డైరెక్షన్‌లో జరిగినట్లు ఆరోపణలున్నాయి. కై కలూరులో కాల్‌మనీ కేసులో దంపతులపై దాడి, ఫ్లెక్సీ ప్రింటింగ్ డబ్బులు అడిగినందుకు షాపు యజమానిని భయపెట్టిన సంఘటన, మార్కెట్ సమీపంలోని ఓ ఎలక్ట్రికల్ షాపుపై దాడి చేసి షాపు తాళాలు వేసిన ఘటన ఇలా చాలా ఘటనల్లో అతని ప్రమేయముంది. ప్రేమ పెళ్లి చేసుకుని తిరిగి వస్తున్న ప్రేమ జంటపై దాడి చేయడం, అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తిపై దాడి ఘటన, ఏలూరుకు చెందిన జర్నలిస్టు ఉర్ల శ్రీనివాస్ కారును అవసరాలకు తీసుకుని అమ్మేసిన ఘటన, సంతమార్కెట్ వద్ద విశ్రాంత రైల్వే ఉద్యోగిపై దాడి ఇలా అనేక ఘటనల్లో కీలక వ్యక్తి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కామినేని అండతో అక్రమ మైనింగ్, మద్యం విక్రయాలతో పాటు పేకాట శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటాడు.

కై కలూరులో కొల్లి అరాచకం