
ఉపాధ్యాయుల నిరసన
భీమవరం: ఉపాధ్యాయుల ఆర్థిక, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్)ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలలు పూర్తయినా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే రెండేళ్లు పూర్తయిపోయినా పీఆర్సీ కమిషన్ వేయకపోవడం శోచనీయమని వెంటనే కమిషన్ వేసి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి బీవీ నారాయణ మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, కేంద్రం మెమో నెంబర్ 57 ప్రకారంగా 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు పీఎన్‌వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా రూపొందించేలా కృషి చేస్తున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల రెండో రోజు సదస్సులో జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం నియంత్రణపై తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు రీసైక్లింగ్ కాకుండా ఉండేలా యంత్రాలను నియోజకవర్గానికి ఒక యూనిట్‌ను అందించాలని, అలాంటి యూనిట్లు ఏర్పాటుచేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు.
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో జలాశయంలోకి 4,941 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దిగువకు 3,089 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి క్రమేపీ వరద నీరు పెరుగుతూ వస్తోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 83.5 మీటర్లు కాగా, ప్రస్తుతం 82.58 మీటర్ల వద్ద కొనసాగుతోంది. జలాశయం వద్ద జలవనరుల శాఖ సిబ్బంది పహారా కాస్తున్నట్లు ఏఈ రాహుల్ భాస్కర్ తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వేగా జ్యువెలర్స్ ఏలూరు షోరూంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన లక్కీడిప్‌లో గెలుపొందిన విజేతల పేర్లను మంగళవారం ప్రకటించింది. లక్కీ డ్రాలో జగ్గవరానికి చెందిన వి.వీరభద్రరావు, ఏలూరుకు చెందిన ఎస్.సతీష్‌కుమార్, జి.రమేష్, దుగ్గిరాలకు చెందిన వి.సత్యప్రియ, ఏలూరుకు చెందిన బి.శారద గెలుపొందారని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్, మేనేజింగ్ డైరక్టర్ నవీన్ వనమా మాట్లాడుతూ ఆఫర్ల కాలంలో ఆభరణాలు కొనుగోలు చేసిన ఖాతాదారులకు లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటిస్తున్నామని చెప్పారు. అనంతరం విజేతలకు రూ.2 లక్షల విలువైన బంగారు/డైమండ్ నెక్లెస్‌లు బహుమతిగా అందజేశారు. వేగా జ్యువెలర్స్ అన్ని షోరూంలలో రాబోయే దసరా, దీపావళి పండుగలకు, వివాహ వేడుకల కోసం సరికొత్త డిజైన్ల ఆభరణాలను విస్తృత శ్రేణుల్లో అందుబాటులో ఉంచినట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు.
భీమవరం: కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22న చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టినట్లు ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉందుర్తి శ్రీనివాస్, మామిడిశెట్టి రామాంజనేయలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌలురైతులకు గుర్తింపు కార్డులు, పెట్టుబడి సాయం ఇవ్వాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.