
తప్పుల తడకగా స్మార్ట్ రేషన్‌కార్డులు
నా పేరును తొలగించారు
కాలనీ పేరునే మార్చేశారు
నూజివీడు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా తయారయ్యాయి. ప్రభుత్వం ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యత స్మార్ట్‌కార్డుల ముద్రణ విషయంలో లేకపోవడంతో స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు నమోదయ్యాయి. దీంతో కార్డుదారులు లబోదిబోమంటున్నారు. ఇంటి పేర్లు, ఇంటి నెంబర్లు, ఊరి పేర్లు తప్పుగా నమోదు కావడం, పాతకార్డులో ఉన్న వారి పేర్లన్నీ కొత్తగా జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులో లేకపోవడం వంటి తప్పులు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. దీంతో వీటిని సరిచేయించుకోవడానికి కార్డుదారులు గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తప్పుల తడకలుగా ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను చూసి ప్రభుత్వం కార్డుల ముద్రణ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థమవుతోందని కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరి పేర్లు స్మార్ట్ రేషన్‌కార్డుపై లేకపోవడంతో రాబోయే రోజుల్లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. నూజివీడు నియోజకవర్గంలో 170 రేషన్ దుకాణాల పరిధిలో 94,185 రేషన్‌కార్డులున్నాయి. వీటిల్లో నూజివీడు పట్టణంలో 13,648 కార్డులు, నూజివీడు మండలంలో 23,922 కార్డులు, ఆగిరిపల్లిలో 20,769 కార్డులు, ముసునూరు మండలంలో 18,515 కార్డులు, చాట్రాయి మండలంలో 17331 చొప్పున కార్డులున్నాయి. వీటిలో దాదాపు 25 నుంచి 30 శాతం కార్డుల్లో తప్పులు నమోదయ్యాయి.
ఏకంగా కాలనీ పేరే తప్పుగా నమోదు
జిల్లాలోనే అతి పెద్ద కాలనీగా ఉన్న పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీ పేరునే తప్పుగా నమోదు చేశారు. ఎమ్మార్ అప్పారావు పేరులో ఎమ్మార్ లేకుండా శ్రీ అప్పారావు కాలనీగా స్మార్ట్ రేషన్ కార్డుల్లో నమోదైంది. ఇలా కాలనీ పేరునే మార్చేయడమేమిటో అర్థం కావడం లేదని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీలో దాదాపు వెయ్యి కుటుంబాలకు చెందిన 5వేల మంది వరకు నివసిస్తున్నారు. తప్పుగా నమోదు కావడం వల్ల వీరందరి కార్డులపైన కాలనీ పేరును సరిచేయాల్సిన అవసరం నెలకొంది. పాత రావిచర్లలో మెతుకుపల్లి శ్రీనివాసరావు, అతని భార్య పద్మావతిలకు కలిపి స్మార్ట్ రేషన్‌కార్డు రావాల్సి ఉండగా కేవలం మెతుకుమిల్లి పద్మావతి ఒక్కరి పేరునే కార్డు రావడంతో ఆమె భర్త శ్రీనివాసరావు వారం రోజులుగా గ్రామ సచివాలయం, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి రూ.80కు వరకు ఫీజు చెల్లించాల్సి వస్తోంది. తప్పుల సవరణను ఉచితంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఆందోళనలో రేషన్ కార్డుదారులు
ఇటీవల ఇచ్చిన స్మార్ట్ రేషన్‌కార్డులో నా భార్య పేరు ఉంచి నా పేరును తొలగించారు. స్మార్ట్ రేషన్‌కార్డును తీసుకొని సరుకులు తెచ్చుకుందామని రేషన్ దుకాణానికి వెళ్లగా నీపేరు లేదు కదా, ఒక్కరికే సరుకులు వస్తాయని రేషన్ డీలరు చెప్పాడు. నా పేరును కార్డులో నుంచి ఎందుకు తీసేశారో తెలియడం లేదు.
– మెతుకుమిల్లి శ్రీనివాసరావు, పాతరావిచర్ల, నూజివీడు మండలం
నూతనంగా ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీ పేరునే మార్చేశారు. ఎమ్మార్ అప్పారావు బదులుగా శ్రీ అప్పారావు అని ముద్రించారు. ఇలా తప్పుగా నమోదు చేయడంతో కార్డుదారులందరూ తప్పులను సరిచేయించుకోవాలి.
షేక్ మస్తాన్, ఎమ్మార్ అప్పారావు కాలనీ, నూజివీడు

తప్పుల తడకగా స్మార్ట్ రేషన్‌కార్డులు

తప్పుల తడకగా స్మార్ట్ రేషన్‌కార్డులు

తప్పుల తడకగా స్మార్ట్ రేషన్‌కార్డులు