
జాయింట్ కలెక్టర్ బదిలీ
ఏలూరు(మెట్రో): ఐఏఎస్ బదిలీల్లో భాగంగా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధాత్రిరెడ్డిని రతన్ టాటా ఇన్నోవేషన్ సీఈవోగా బదిలీ చేసింది. ప్రస్తుతం జిల్లాకు ఎవరినీ కేటాయించలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బదిలీల్లో భాగంగా ధాత్రిరెడ్డిని జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించారు.
ద్వారకాతిరుమల: క్షేత్రంలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఈ క్రమంలో భీమడోలు–ద్వారకాతిరుమల ప్రధాన రహదారి పలుచోట్ల కాలువలా మారింది. దాంతో ఆ మార్గంలో వివిధ వాహనాలపై యాత్రికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రధానంగా ద్వారకాతిరుమలలోని కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలో, అలాగే గొల్లగూడెం, సూర్యచంద్రరావుపేట, పంగిడిగూడెం వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. గంటల తరబడి నీరు అలాగే ఉండిపోవడంతో రోడ్డుపై ఉన్న గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీల్లోని మురుగు, చెత్తాచెదారం రోడ్లపైకి చేరింది.
ఏలూరు (టూటౌన్): స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు, నైట్ వాచ్‌మెన్‌లకు జీవో నెంబర్ 7 ప్రకారం కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని, రెండు నెలల బకాయిలు ఇవ్వాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడుతూ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనాలు లేవని, ఇచ్చే అరకొర జీతాలు సైతం నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపారు. నెలంతా పని చేసినా స్వీపర్లకు రూ.4000, శానిటేషన్ వర్కర్‌కు రూ.6 వేల జీతం ఇస్తున్నారని విమర్శించారు. తక్షణం వేతనాలు పెంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఏలూరు (టూటౌన్): ఆయిల్‌పామ్ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆయిల్‌పామ్ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం, ఆయిల్‌పామ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 13 మండలాల్లో పామాయిల్ విస్తారంగా పండుతుందన్నారు. ఆ తోటలపై ఆధారపడి పని చేస్తున్న కూలీల కుటుంబాలు దినదినగండంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రమాదాలకు గురై వికలాంగులుగా మారిన కార్మికుడికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు జె.హరీష్, జిల్లా నాయకులు ఎం.సత్యనారాయణ, కే రాంబాబు, కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో అవసరమైన యూరియా తదితర ఎరువులను ప్రభుత్వం తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని, బ్లాక్ మార్కెట్ విక్రయాలను అరికట్టాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు మద్దుకూరి బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో అవసరమైన యూరియా లభించక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. రూ.300 ఖరీదు చేసే యూరియాను రూ.వెయ్యికి విక్రయిస్తున్నారన్నారు. బ్లాక్ మార్కెట్లో యూరియా విక్రయిస్తున్న షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.

జాయింట్ కలెక్టర్ బదిలీ