
కౌలు రైతుకు దక్కని గుర్తింపు
ఏలూరు (మెట్రో): రైతులు సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రాష్ట్రం సంతోషంగా ఉంటే దేశం సంతోషంగా ఉంటుంది. అయితే దీనికి విరుద్ధంగా రాష్ట్రంలో కూటమి సర్కారు పాలన సాగిస్తోంది. రైతులను అన్నివిధాలా మోసం చేస్తున్న సర్కారు తాజాగా కౌలు రైతులను సైతం నట్టేట ముంచేస్తోంది. అరకొర పొలం కౌలుకు తీసుకుని సాగు చేసుకునే రైతులకు కనీసం గుర్తింపు కార్డులు కూడా అందించకుండా జాప్యం చేస్తోంది.
సీసీఆర్ కార్డులు తప్పనిసరి
కౌలు రైతులకు పండించిన పంటను ప్రభుత్వానికి విక్రయించుకునే వెసులుబాటు కలగాలంటే ఈ–పంటలో నమోదు చేసుకోవాలి. విపత్తుల వల్ల నష్టపోతే ప్రభుత్వ సాయం అందాలన్నా ఈ–పంట నమోదు తప్పనిసరి. అయితే ఈ–పంట నమోదులో కౌలు రైతులను నమోదు చేయాలంటే సీసీఆర్ (కౌలు గుర్తింపు కార్డు) తప్పనిసరి. అయితే వీటిని అందించకుండా కూటమి సర్కారు కౌలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
కార్డులు అందవు.. రుణాలు దక్కవు
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించడంలో క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం, భూ యజమానుల అంగీకారం వంటి కారణాలతో ఈ ప్రక్రియ నామమాత్రంగానే కొనసాగుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయినప్పటికీ కౌలు కార్డులు అందించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కౌలు గుర్తింపు కార్డులు వస్తే పంట సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం రుణం పొందేందుకు ఇదే సరైన సమయం కావడంతో కౌలు రైతులు సైతం కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సీజన్ ప్రారంభం కావడంతో పంటలకు పెట్టుబడి కోసం ప్రైవేట్ అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు. ఇదే అదనుగా తీసుకుంటున్న దళారులు పెట్టుబడికి సొమ్ములు ఇచ్చి పంటలు చేతికి అందిన తర్వాత కౌలు రైతుల నుంచి అధిక వడ్డీలు పేరు చెప్పి పంటలను తక్కువ ధరలకే కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
కానరాని అవగాహన
ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే రైతులకు, భూ యజమానులకు అవగాహనా సదస్సులు నిర్వహించాల్సి ఉంది. ఈ సదస్సులు నిర్వహించడంలోనూ కూట మి సర్కారు విఫలమైంది. క్షేత్రస్థాయిలో కౌలు కార్డులు మంజూరుకు రెవెన్యూ సిబ్బంది సైతం అందుబాటులో ఉండాల్సి ఉంది. అయితే వ్యవసాయ, రెవెన్యూ శాఖల సమన్వయలోపం కారణంగా కౌలు కార్డులు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
‘కౌలు’కునేదెలా..?
గుర్తింపు కార్డుల జారీలో తీవ్ర జాప్యం
ప్రభుత్వ పథకాలకు కార్డు తప్పనిసరి
జిల్లావ్యాప్తంగా 75 వేల కార్డుల జారీ లక్ష్యం
సగం కూడా ఇవ్వని అధికారులు
గతేడాది 65 వేల మందికి జారీ
2 లక్షల మంది వరకు కౌలు రైతులు
జిల్లావ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో ప్రభుత్వం 75 వేల మందికి కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్ణయించింది. అయితే కనీసం లక్ష్యాన్ని కూడా పూర్తి చేయకుండా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. బ్యాంకులు కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడాలి.
– కె.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి
కౌలు కార్డులు అందించాలి
కౌలు రైతులకు తక్షణమే కౌలు రైతు గుర్తింపు కార్డులు అందించాలి. తద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించాలి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగా పనులు ఊపందుకుంటున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్ధిక సహాయం అందలేదు. ప్రభుత్వం కౌలు రైతులను కూడా గుర్తించి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.
–వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, కౌలు రైతు, పూళ్ల
కార్డుల జారీలో అలసత్వం.. ఆంతర్యం ఏమిటో?
గతేడాది జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే 65,147 మందికి కౌలు కార్డులు ఇచ్చారు. అయితే ప్రస్తుతం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకూ 38,234 మందికి మాత్రమే ఇచ్చారు. అయితే కౌలు రైతుల గుర్తింపు కార్డుల లక్ష్యం 75 వేలుగా ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం సీజన్ ప్రారంభమై ఇప్పటికే వ్యవసాయ పనులు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికీ కౌలు కార్డులు జారీ చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో కూటమి సర్కారుకే తెలియాలి.

కౌలు రైతుకు దక్కని గుర్తింపు

కౌలు రైతుకు దక్కని గుర్తింపు

కౌలు రైతుకు దక్కని గుర్తింపు