
వినియోగంలోకి తోపుడు రిక్షాలు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెంలో గ్రామా ల్లోని తడి, పొడి చెత్తను సేకరించి కేంద్రాలకు తరలించే విధంగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన తోపుడు రిక్షాలు నిరుపయోగంగా ఉండడంపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘నిరుపయోగంగా తోపుడు రిక్షాలు’ అనే శీర్షికపై అధికారులు స్పందించారు. తోపుడు రిక్షాలను మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకువచ్చారు. త్వరలోనే అన్ని రిక్షాలను కూడా మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకువస్తామని కార్యదర్శి యు.దేవప్రియుడు తెలిపారు. గ్రామంలో 1336 ఇళ్లు ఉన్నాయని వీటిలో తడి, పొడి చెత్త సేకరణ కోసం ప్రతి 250 ఇళ్లకు ఒక గ్రీన్ అంబాసిడర్‌ను ఏర్పాటు చేసామని చెప్పారు. ఐదుగురు గ్రీన్ అంబాసిడర్‌లు అవసరం కాగా అదనంగా మరొక ఇద్దరిని ఏర్పాటు చేసి మరొక ఇద్దరితో కలిపి మొత్తం ఏడుగురితో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు.
పీ4 గ్రామ సభల నిర్వహణపై సమీక్ష
ఏలూరు(మెట్రో): పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమం గ్రామ సభలు అర్ధవంతంగా నిర్వహించి, వివరాలను తక్షణం అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రామసభల నిర్వహణ, బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల ఎంపిక తదతర అంశాలపై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సున్నా పేదరికమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రూపొందించారన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో బుధవారం నిర్వహించిన గ్రామసభల వివరాలను తక్షణమే అప్ లోడ్ చేయాలని మిగిలిన గ్రామసభలను రేపటికల్లా పూర్తిచేయాలన్నారు.
మహిళ మెడలో గొలుసు చోరీకి యత్నం
ముదినేపల్లి రూరల్: ముదినేపల్లి మండలం పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెంలో బుధవారం మహిళ మెడలో గోలుసు చోరీ చేశారు. ముదినేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరంకి వెంకటేశ్వరమ్మ ఇంటి వద్ద కొట్టు నిర్వహిస్తోంది. మూడు రోజులుగా ఒక యువకుడు పల్సర్ బైక్‌పై వచ్చి తినుబండారాలు కొనేవాడు. ఈ క్రమంలో బుధవారం వెంకటేశ్వరమ్మ మెడలో మంగళ సూత్రం తెంపాడు. వెంటనే ఆమె ప్రతిఘటించింది. చాకుతో ఆమె నుదిటిపై దాడి చేయడంతో గాయమైంది. ఇంతలో జనం వస్తుండడంతో గొలుసును వదిలి బైక్‌పై పరారయ్యాడు. బాధితురాలిని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేశారు.
శ్రీవారి దేవస్థానం శృతి విద్వాన్‌పై ఫిర్యాదు
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న శృతి విద్వాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ, తోటి ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుపై ఆలయ అధికారులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. దేవదాయ శాఖ నియమావళికి విరుద్ధంగా ఓ వ్యక్తి ఆలయంలో పదేళ్లుగా శృతి విద్వాన్ విధులు నిర్వర్తిస్తున్నాడని, నాదస్వరం ఊదకుండా మోసం చేస్తున్నాడని, మరో శృతి విద్వాన్ కృష్ణమూర్తి ఇటీవల ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తికి ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణాధికారిగా ఏఈఓను నియమించారు.

వినియోగంలోకి తోపుడు రిక్షాలు