అనుమతి లేని వైద్యం | - | Sakshi
Sakshi News home page

అనుమతి లేని వైద్యం

Jul 25 2025 4:33 AM | Updated on Jul 25 2025 4:33 AM

అనుమతి లేని వైద్యం

అనుమతి లేని వైద్యం

కామవరపుకోట: రోగులకు ప్రథమ చికిత్స చేయాల్సిన రిజిస్టర్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ (ఆర్‌ఎంపీ) వచ్చీరాని వైద్యం చేస్తూ రోగి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జిల్లాలో కొందరు ఆర్‌ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తుండగా, మరి కొందరు అనుమతులు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తూ రోగులను అడ్డంగా దోచుకుంటున్నారు. జిల్లాలో సుమారు 4 వేల మందికి పైగా ఆర్‌ఎంపీలు గ్రామాల్లో డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. క్లినిక్‌ బోర్డులు పెట్టి విచ్చలవిడిగా వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేద లు పెద్దాస్పత్రులకు వెళ్లలేని పరిస్థితుల్లో వీరి వద్దే వైద్యం చేయించుకుంటున్నారు. ఇదే అదునుగా ఆర్‌ఎంపీలు డబ్బులకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

ఆర్‌ఎంపీలు చేయాల్సినవి..

చిన్న గాయమైతే కట్టు కట్టడం, జ్వరం వస్తే పా రాసిటమాల్‌ వంటి మందులు ఇవ్వడం వరకే ఆర్‌ఎంపీలు పరిమితం కావాలి. కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నా యి. రోగి సమస్య పెద్దదైతే అందుబాటులో ఉన్న పెద్ద ఆస్పత్రికి రిఫర్‌ చేయాలి.

ఆర్‌ఎంపీలు చేస్తున్నవి..

ఆర్‌ఎంపీలు నిబంధనలు మీరి ఎంబీబీఎస్‌ డాక్టర్‌ మాదిరిగా ప్రిస్కిప్షన్‌ ప్యాడ్‌ ముందు పెట్టుకుని, స్టెతస్కోప్‌ మెడలో వేసుకుని రోగుల్ని పరీక్షిస్తూ మందులు, ల్యాబ్‌ టెస్ట్‌, స్కానింగ్‌లు రాస్తున్నారు. ఒక్కోసారి సర్జరీలు చేసి రోగులకు ప్రాణాలు మీదకు తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతటితో ఆగకుండా క్లినిక్‌లు ఏర్పాటుచేసి బెడ్స్‌ వేసి రోగులకు ఫ్లూయిడ్స్‌ ఎక్కించడం, ఎక్కువ మోతాదులో యాంటీ బయోటిక్‌ ఇంజక్షన్లు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. అప్పటికీ రోగం తగ్గకపోతే సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేస్తున్నారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స, టెస్టులు, రూమ్‌ అద్దెలు, మందులు వాటిలో కమీషన్లు దండుకుంటున్నారు. అలాగే వారి క్లినిక్‌లలో బిల్లులు లేని నాసిరకం మందులతో దర్జాగా వైద్యం చేస్తున్నారు.

మచ్చుకు కొన్ని..

కామవరపుకోట మండలంలోని కళ్లచెరువులో ఓ ఆర్‌ఎంపీ వచ్చీరాని వైద్యం చేసి రోగి ప్రాణం మీదకు తెచ్చాడు. ఇదే ఆర్‌ఎంపీ రెండేళ్ల క్రితం సాగిపాడులో ఓ వ్యక్తికి వైద్యం చేయగా అతడు ప్రాణాలు పోయినట్టు స్థానికులు చెబుతున్నారు.

కామవరపుకోట మండల కేంద్రంలో ఆర్‌ఎంపీలు పరిమితికి మించి వైద్యం చేసి ప్రా ణాలు తీయగా మృతుడి కుటుంబంతో రాజీ కుదుర్చుకున్న సందర్భాలు ఉన్నాయి.

కామవరపుకోట మండలంలోని వీరిశెట్టిగూడెంలో ఓ యువకుడు న్యుమోనియాతో బాధపడుతూ తడికలపూడిలో ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లగా వైద్యం వికటించింది. యువకుడిని ఏలూరు ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.

అలాగే కొందరు ఆర్‌ఎంపీలు సొంతంగా మందులు షాపులు నిర్వహిస్తూ, అక్కడే వైద్యం చేస్తు డబ్బులు దండుకుంటున్నారు.

ప్రాణాలతో చెలగాటం

వచ్చీరాని వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీలు

నిబంధనలు మీరి క్లినిక్‌ల నిర్వహణ

ధనార్జనే ధ్యేయంగా విధులు

గ్రామాల్లో ఇష్టారాజ్యంగా వైద్యసేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement