
బ్యాగుల నాణ్యతలో డొల్లతనం
ఆగిరిపల్లి: కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగుల నాణ్యతలో డొల్లతనం బయటపడుతోంది. పట్టుమని పది రోజులు కూడా కాకుండానే బ్యాగులు చిగిరిపోతున్నాయి. ఆగిరిపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి గురువారం పాఠశాలకు వెళుతుండగా బ్యాగ్ హ్యాండిల్ తెగిపోయింది. దీంతో ఇలా బ్యాగును చేతికి తగిలించుకుని తంటాలు పడుతూ బడికి వెళ్లాడు. మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు జిప్పులు ఊడిపోవడం, చిగిరిపోవడం వంటివి జరుగుతున్నాయని, నాణ్యత లేని బ్యాగులు ఇవ్వడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పొగాకు బోర్డులో నమోదు తప్పనిసరి
జంగారెడ్డిగూడెం: నారుమడులకు సిద్ధమయ్యే పొగాకు రైతులు పొగాకు బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకుని రశీదు పొందాలని వేలం కేంద్రం నిర్వాహక అధికారి బి.శ్రీహరి గురువారం ప్రకటనలో తెలిపారు. పంట నియంత్రణలో భాగంగా నర్సరీ నుంచి నిబంధనలు కఠినతరం చేస్తున్నామని పేర్కొన్నారు. సీటీఆర్‌ఐ, ఐటీసీ సంస్థలు విత్తనాలు సరఫరా చేస్తాయని, వాణిజ్య రైతులు నారుమడులు 2 హెక్టార్ల వరకు విస్తీర్ణంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు. హెక్టారుకు రూ.500 రుసుం చెల్లించాలని సూచించారు. బోర్డులో రిజిస్ట్రేషన్ లేకుండా నర్సరీలు వేసే వారిపై చర్యలు తీసుకుంటామని, నమోదు చేయించుకున్న వారి జాబితాను బోర్డు వద్ద ప్రదర్శిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ లేని నర్సరీల నుంచి నారు కొనుగోలు చేసి పొగాకు సాగు చేస్తే బేరన్, రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తామని తెలిపారు.
ఆర్టీసీ స్థలాలను కాపాడుకుందాం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విలువైన ఆర్టీసీ స్థలాలను, ప్రజల, ప్రయాణికుల అవసరాలకు కా కుండా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే చర్యలను స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తోందని యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి టీపీఆర్ దొర అన్నారు. గురువారం ఏలూరు డిపో వద్ద ఆర్‌టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. డిపో కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ము ఖ్య అతిథిగా దొర మాట్లాడుతూ విజయవాడ గవర్నర్ పేట–2 డిపో, విజయవాడ పాత బ స్టాండు స్థలాలను బహుళ జాతి సంస్థ ‘లూ లూ’ షాపింగ్ మాల్‌కు ఇచ్చే ప్రతిపాదనలు విరమించుకోవాలన్నారు. ప్రయాణికులు భవిష్యత్తు రవాణా అవసరాలకు ఉపయోగపడే ఆర్టీసీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలాంటి చర్యకు పూనుకోడాన్ని ప్రజలందరూ నిరసించాలని కోరారు. లూలూ షాపింగ్ మాల్ కోసం ఆర్‌టీసీ డిపోను మరో చోటకు తరలించాలని నిర్ణయించడం వి చారకరమన్నారు. ఆర్‌టీసీని కాపాడుకోవడం కోసం ప్రజలు, ప్రయాణికులు, ప్రజా సంఘా లు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. డిపో కార్యదర్శి టీకే రావు, జిల్లా కార్యదర్శి ఎన్.సురేష్, జీవీ శాస్త్రి, సీహెచ్ నారాయణ, ఎ.రమేష్ ప్రసాద్, జీవీ రావు, పి.శ్యామల, బి.సూర్య కళ, వి.సూరన్న, జి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రుణాల మంజూరు వేగిరపర్చాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు నిర్దేశించిన మేర రుణ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు రుణా ల మంజూరు, ఉపాధి యూనిట్ల గ్రౌండింగ్, తదితర అంశాలపై ఏలూరు కలెక్టరేట్ నుండి డీఆర్‌డీఏ ఏపీఎంలు, కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో 15,353 సంఘాలకు రూ.1,145.20 కోట్ల రుణాల మంజూరుకు మైక్రో క్రెడిట్ ప్లాన్‌లను బ్యాంకులకు అందించామన్నారు. ఇప్పటివరకూ 2,888 సంఘాలకు రూ.237 కోట్ల రుణాలను బ్యాంకులు ఆమోదించాయని, మిగిలిన రుణాలను కూడా ఆమోదించేలా డీఆర్‌డీఏ అధికారులు బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు.