
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం
బాబు ష్యూరిటీ... మోసం గ్యారెంటీపై విసృతస్థాయి సమావేశం
బుట్టాయగూడెం: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్దామని వైఎస్సార్‌సీపీ పోలవరం నియోజకవర్గ సమన్వయ కర్త తెల్లం రాజ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. మండలంలోని దుద్దుకూరులో బుధవారం సాయంత్రం ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ’ కార్యక్రమంపై వైఎస్సార్‌సీపీ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో చేపట్టే ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రతి గడపకూ వెళ్ళి కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేద్దామన్నారు. ఎన్నికల ముందు సూపర్‌సిక్స్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను నిలువునా ముంచారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో తల్లికి వందనం పథకం అనేక మందికి అందలేదని వారు ఆరోపించారు. రైతులకు భరోసా ఇవ్వకుండా ప్రతీ రైతుకు కూటమి ప్రభుత్వం బాకీ పడిందని అన్నారు.
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
త్వరలోనే స్థానిక ఎన్నికలు ఉంటాయని వాటిలో సత్తా చాటి వైఎస్సార్‌సీపీ అంటే ఏంటో అర్థమయ్యేలా చేద్దామని రాజ్యలక్ష్మి, బాలరాజులు అన్నారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు సత్తా చూపిస్తే మరొక సారి ఇలా తప్పుడు వాగ్దానాలు ఇవ్వాలంటేనే భయపడతారని చెప్పారు. కార్యకర్తలే పార్టీకి బలమని వారిని కలుపుకుంటు నియోజకవర్గంలోని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అలాగే కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రజలకు అందించిన పథకాలను కూడా వివరించారు. అలాగే బాబు షూరిటీ– మోసం గ్యారంటీకి సంబంధించిన స్కానర్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లూరి రత్నాజీరావు, ఆరేటి సత్యనారాయణ, సయ్యద్ బాజీ, మొడియం రామతులసి, గగ్గులోతు మోహన్‌రావు, తాళ్లూరి ప్రసాద్, చింతలపూడి వెంకటనారాయణ, ఉయికే బొజ్జి, కలగర నాని, బన్నే బుచ్చిరాజు, మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.