
మిథున్ రెడ్డి అరెస్టు అక్రమం
నూజివీడు: రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి అరెస్టు అక్రమమని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు అన్నారు. నూజివీడులోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను, వైఎస్సార్‌సీపీ నాయకులను, ప్రజాప్రతినిధులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫేస్టోను అమలు చేయలేకే కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేస్తూ ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తోందన్నారు. చంద్రబాబు పాలన తీరును ప్రజలు గమనిస్తున్నారని, వాళ్లు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులను నడిపి వచ్చిన డబ్బులన్నింటినీ రాష్ట్ర ఖజానాకు జమ చేస్తే ఇంకా అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రతి మద్యం సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.30నుంచి రూ.40ల వరకు అధికంగా అమ్ముతున్నారని, ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎమ్మార్పీకే మద్యంను విక్రయించే వారని, మద్యం దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధిని సైతం కల్పించిందన్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చివరకు న్యాయమే గెలుస్తుందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తెరగాలన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ గ్రామంలో చూసినా వీధికి రెండు మూడు మద్యం బెల్టుషాపులు కనిపిస్తున్నాయన్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిందేమన్నా ఉందంటే రూ.1.70లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దిందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు మీర్ అంజాద్ ఆలీ, నవుడు నాగమల్లేశ్వరరావు, నాయకులు మలిశెట్టి బాబీ, గాదెరెడ్డి రంజిత్‌రెడ్డి, షేక్ యూనస్‌పాషా, బసవా వినయ్, పిళ్లా చరణ్, కంచర్ల లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.