
వరద ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు
వేలేరుపాడులో కలెక్టర్ సమీక్ష
వేలేరుపాడు: గోదావరి వరదలు ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు. వరదలు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం వరదలపై ముందస్తు ప్రణాళిక సమావేశంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న 3 రోజుల్లో భద్రాచలం నుంచి గోదావరి వరద నీరు 9 లక్షల క్యూసెక్కులపైగా పైగా దిగువకు వచ్చే అవకాశం ఉందని, పెద్దవాగు, ఎద్దువాగుల నుంచి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వరద ముంపు ప్రభావం పొంచి ఉన్నందున, ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి ముందుగానే సహాయక చర్యలకు సిద్ధం కావాలన్నారు. ముంపు ప్రమాద ప్రాంతాల్లో గర్భిణులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొయిదా వంటి కొండ ప్రాంతాల గ్రామాల ప్రజలకు, వరద ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు టార్పాలిన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 3 నెలలకు సరిపడా నిత్యావసరాలు సిద్ధం చేయాలని పౌర సరఫరాల శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు.