
మహిళ దారుణ హత్య
కలిదిండి(కై కలూరు): భార్య వివాహేతర సంబంధానికి ఎదురింటి మహిళ సహకరిస్తోందనే అనుమానంతో వివాహితను హత్య చేసిన ఘటన కలిదిండి మండలం పోతుమర్రు శివారు గొల్లగూడెంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్టా రామాంజనేయులు, కృష్ణవేణి భార్యభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. రామాంజనేయులు చెరువులు సాగు చేస్తున్నాడు. ఇంటి ఎదురుగా నంగెడ్డ వరలక్ష్మీదేవీ(37) భర్తతో కలసి జీవిస్తోంది. ఆమె భర్త ఆటో నడపుతుంటాడు. గ్రామానికి చెందిన కట్టా నాగమల్లేశ్వరరావు(48) తరుచుగా రామాంజనేయులు ఇంటి వద్దకు వస్తున్నాడు. ఆ సమయంలో ఎదురింటి వరలక్ష్మీదేవితో మాట్లాడేవాడు. రామాంజనేయులు తన భార్య కృష్ణవేణికి నాగమల్లేశ్వరరావుతో వివాహేతర సంబంధం ఉందని, దీనికి మధ్యవర్తిగా వరలక్ష్మీదేవి వ్యవహరిస్తోందని అనుమానించాడు. మంగళవారం మధ్యాహ్నం వరలక్ష్మీదేవి కూలి పనుల నుంచి ఇంటికి వచ్చింది. ఆమె భర్త కుమార్తె టీసీ నిమిత్తం వెంకటాపురం స్కూల్ వద్దకు వెళ్ళాడు. వరలక్ష్మి ఇంట్లో ఒంటరిగా భోజనం చేస్తోంది. ఇదే అదనుగా వెళ్ళి కత్తితో ఆమె మెడపై నరికి రామాంజనేయులు పరారయ్యాడు. ఆమె రక్తపు మడుగులో కొట్టుకుని మరణించింది. కొన్ని గంటలకు భర్త వచ్చి చూసేసరికి అప్పటికే ఆమె మరణించింది. భర్త ఫిర్యాదుపై ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్, రూరల్ సర్కిల్, టౌన్ సీఐలు వి.రవికుమార్, పి.కృష్ణ, ఎస్సైలు వెంకటేశ్వరరావు, రాంబాబు, వీరభ్రదరావు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డీఎస్పీ మాట్లాడుతూ భార్యపై అనుమానం.. ఎదురింటి వరలక్ష్మీదేవి అందుకు సహకరిస్తోందనే హత్యకు పాల్పడినట్లు చెప్పారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామన్నారు. మృతదేహాన్ని కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
భార్య వివాహేతర సంబంధానికి సహకరిస్తోందని ఘాతుకం
కలిదిండి మండలం గొల్లగూడెంలో ఘటన

మహిళ దారుణ హత్య