
పునరావాస కేంద్రం పరిశీలన
కుక్కునూరు: గోదావరి వరదల దృష్ట్యా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశాల మేరకు మంగళవారం పలువురు అధికారులు మండలంలోని దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస సహాయక కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు పునరావాస కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టారు. దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీని సందర్శించిన వారిలో పంచాయతీరాజ్ ఎస్‌ఈ కె.శ్రీను, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ జి.త్రినాథ్‌బాబు, గృహనిర్మాణ శాఖ పీడీ జి.సత్యనారాయణ తదితరులున్నారు.
ఉపాధ్యాయులను నియమించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాఠశాలలో ప్రస్తుతం ఎస్‌ఏ ఉర్దూ, ఎస్‌ఏ గణితం, ఎస్‌ఏ పీఎస్ ఉపాధ్యాయులు లేనందున వెంటనే అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించాలని మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. కొన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందనందున పూర్తిస్థాయిలో చేరేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు తూర్పువీధి ఉర్దూ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల, తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీషు మీడియంలోనే బోధన కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఈఓకు వినతిపత్రం సమర్పించిన వారిలో ఏపీటీఎఫ్ ఆడిట్ కమిటీ సభ్యుడు ఎస్‌కే రంగావలి, రూరల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామశేషు కుమార్, శ్రీనివాస్ తదితరులున్నారు.
బంద్‌ను జయప్రదం చేయాలి
భీమడోలు: కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9న దేశ వ్యాప్తంగా తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు కోరారు. పూళ్ల రై్‌స్ మిల్లు వర్కర్లతో కలిసి గోడ పత్రికలు, కరపత్రాలను మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పని చేస్తున్న కోట్లాది మంది కార్మికులు కనీస వేతనాలు లేక పీఎఫ్, ఈపీఎఫ్ పింఛన్ ప్రమాద బీమా లాంటివి లేనందున అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలన్నారు. పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు భద్రత కల్పించాలని కోరారు. వివిధ శాఖల్లో పని చేసే ఉద్యోగులు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకటేశ్వరరావు, బెండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు అధికారులకు రాష్ట్ర స్థాయి అవార్డులు
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు జిల్లా అధికారులు జూలై 9న విజయవాడలో గవర్నర్ చేతుల మీదుగా రెడ్‌క్రాస్ అవార్డులు అందుకోనున్నారు. అవార్డులు పొందిన వారిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, గ్రామీణ అభివద్ధి శాఖ అధికారి ఎం.ఎస్.ఎస్.వేణుగోపాల్, మాజీ విద్యా శాఖ అధికారి ఆర్.వెంకటరమణ ఉన్నారు. వీరు 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో రెడ్‌క్రాస్ కోసం రూ.5 లక్షలకుపైగా నిధులు సమీకరించారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, రెడ్‌క్రాస్ అధ్యక్షురాలు చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ డా.ఎం.ఎస్.వి.ఎస్.భద్రిరాజు, వైస్ చైర్మన్ వబిలిసెట్టి కనకరాజు తదితరులు అభినందనలు తెలిపారు.