
సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎంటీఎస్, హెచ్‌ఆర్ పాలసీ, సమ్మె అగ్రిమెంట్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ చైర్మన్ కే.వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యా శాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు పని భారం తగ్గించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఈపీఎఫ్ వర్తింప చేసి, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ లీవులు, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని తాము అడుగుతున్నామని స్పష్టం చేశారు.