
టైం టేబుల్‌పై ట్రిపుల్ ఐటీలో రగడ
నూజివీడు: ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యను అందిస్తున్న నూజివీడు ట్రిపుల్‌ఐటీలో అనుభవం ఉన్న అధికారులు లేక నిరంతరం సమస్యలకు వేదికగా మారుతోంది. మెంటార్లకు సంబంధించిన టైం టేబుల్ నుంచి ప్రతి విషయంలోనూ అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా పీయూసీకి బోధన చేసే తెలుగు మెంటార్లకు సంబంధించి పీరియడ్ల కేటాయింపు వివాదాస్పదంగా తయారైంది. తెలుగు డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ నిబంధనల ప్రకారం వర్క్ లోడ్ ఉండేలా మెంటార్లకు టైం టేబుల్‌ను రూపొందించగా, దానిని డీన్ అకడమిక్స్ తన ఇష్టారాజ్యంగా మార్చేయడం ట్రిపుల్ ఐటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండు సంవత్సరాలకు బోధించేందుకు సరిపడా మెంటార్లు ఉండగా వారిని కాదని డీన్ అకడమిక్స్ సాధు చిరంజీవి హెచ్‌ఓడీ వేసిన టైం టేబుల్‌ను పక్కన పెట్టి తెలుగు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీయూసీకి టైం టేబుల్ వేయడంపై మెంటార్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
గొడవకు కారణం ఇదే..
నూజివీడు ట్రిపుల్ ఐటీలోని పీయూసీ రెండు సంవత్సరాల విద్యార్థులకు తెలుగు బోధించేందుకు ఆరుగురు మెంటార్లు ఉన్నారు. వీరికి వారానికి 18 గంటల వర్క్‌లోడు ఉండేలా టైం టేబుల్ రూపొందించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించిన పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. దీనికి ఒంగోలు ట్రిపుల్ ఐటీ నుంచి ముగ్గురు తెలుగు ఫ్యాకల్టీని పంపగా శ్రీకాకుళం నుంచి ముగ్గురు రావాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే వచ్చారు. మిగిలిన ఇద్దరు తాము మంత్రి మనుషులమంటూ ట్రిపుల్ ఐటీ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇక్కడకు రాకుండా అక్కడే ఉండిపోయారు. దీంతో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తెలుగు బోధించేందుకు ఫ్యాకల్టీ కొరత ఏర్పడింది. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది.
గతంలో ఇంజినీరింగ్‌లో తెలుగు బోధించేందుకు ముగ్గురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ఆ తరువాత ఇంజినీరింగ్‌లో తెలుగు తొలగించడంతో వీరిని పీయూసీకి బోధించమని పీయూసీకి పంపుతుంటే తమకు వర్క్‌లోడ్ సరిపోతుందంటూ పీయూసీ మెంటార్లు అభ్యంతరం చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు తెలుగు బోధించడానికి ఒక్క ఫ్యాకల్టీనే ఉండటం వల్ల ఖాళీగా ఉంటున్న ముగ్గురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాఠాలు చెప్పిస్తే ఎలాంటి సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. అలా కాకుండా ఈ ముగ్గురికి నూజివీడు ట్రిపుల్ ఐటీలో పీయూసీకి నియమించి, ఇక్కడి మెంటార్లను శ్రీకాకుళం పీయూసీకి చెప్పేందుకు నియమించారు. దీంతో ఇలా ఎలా చేస్తారంటూ మెంటార్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇక్కడ సరిపోయే స్టాఫ్ ఉన్నామని, మిగులు స్టాఫ్ ఉంటే వారితో ఎక్కడ అవసరముంటే అక్కడ చెప్పించాలే గాని ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. సమస్య చిన్నదైనా యాజమాన్యం మాత్రం సరిగా డీల్ చేయలేక సమస్యలను పెద్దది చేసుకుంటున్నారనే విమర్శలు ట్రిపుల్ ఐటీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.
డీన్‌తో మాట్లాడతా
తెలుగు సబ్జెక్టు బోధించే విషయమై వచ్చిన సమస్యపై డీన్‌తో మాట్లాడతా. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ నుంచి మరో ఇద్దరు తెలుగు మెంటార్లు ఇక్కడకు వస్తున్నారు. వాళ్లు వస్తే తెలుగు బోధించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
బీ లక్ష్మణరావు, ఇన్‌ఛార్జి ఏఓ, నూజివీడు.