
ప్రమాదకరంగా ఉప్పుటేరు వంతెన
నరసాపురం రూరల్: నిత్యం సముద్రవేటకు వెళ్లే మత్స్యకారులు, ఉప్పుకార్మికులు, ఆక్వా రైతులకు ఎంతో ఆవశ్యకమైన చినలంక ఉప్పుటేరుపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. తరచూ ఈ ప్రాంతంలో ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పరిస్థితి అధ్వానంగా ఉంటున్నప్పటికీ పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. బియ్యపుతిప్ప నుంచి పెదమైనవాని లంక మీదుగా పేరుపాలెం వైపు వెళ్లే ఉప్పుటేరుకు చినమైనవానిలంక గ్రామంలో తూరలపై ఏర్పాటుచేసిన వంతెనపై ఉన్న రోడ్డు మార్గం ద్వారానే ఈ గ్రామ వాసులంతా సముద్రం వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. నిత్యం ఈ వంతెనపై సుమారు వందలాది మంది మత్స్యకారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడి తూరలు శిథిలమై రంధ్రాలు పడడంతో పలుచోట్ల రోడ్డు దిగబడిపోయి ప్రమాదకరంగా తయారైంది. ఉప్పుటేరు ఆటుపోట్లకు నిత్యం వంతెన కోతకు గురవుతూనే ఉంటుంది.
గతంలో తాత్కాలిక మరమ్మతులు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వంతెన బాగా శిథిలం కావడంతో తాత్కాలికంగా మరమ్మతులు చేసి ప్రయాణానికి అనువుగా చేశారు. అనంతరం వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు కూడా పంపారు. అయితే ఇటీవల ఉప్పుటేరు భారీగా కోతకు గురికావడంతో వంతెన పరిస్థితి దయనీయంగా మారింది. ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని ఈ ప్రాంత వాసులు వాపోతున్నారు. వేకువజామునే నాలుగు గంటల ప్రాంతంలో ఐల వేసేందుకు చీకట్లోనే మత్స్యకారులు దీపాలు చేతపట్టి సముద్ర చెంతకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఈ రోడ్డుపై ఉంటున్న భారీగుంతలుతోనూ ప్రమాదకరంగా ఉన్న శిథిల వంతెనతో పలు ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. వెంటనే ఈ ప్రాంతంలో పటిష్ట వంతెనను ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
భయం భయంగా వంతెనపై ప్రయాణం
నాకు వంతెన అవతల పర్రలో చెరువులు ఉన్నాయి. వాటి సాగు నిమిత్తం నిత్యం నేను ఈ వంతెనపై నుంచే రాకపోకలు సాగిస్తుంటాను. ఒక్కోసారి వంతెన కోతకు గురై ప్రమాదకర స్థితిలో ప్రయాణం సాగించాల్సి వస్తుంది. ఈ వంతెన పూర్తిగా తెగిపోతే పెదమైనవానిలకం గ్రామం నుంచి తిరిగి రావడం తప్ప మరో మార్గం లేదు.
– మైల వెంకన్న, చినమైనవానిలంక
వంతెన నిర్మాణం అత్యవసరం
ఈ వంతెనపై మా గ్రామస్తులమే కాకుండా నిత్యం చినమైనవానిలంక బీచ్‌ను సందర్శించే వారు కూడా నిత్యం ప్రయాణిస్తుంటారు. తుఫాన్‌లు వంటి పకృతి విపత్తుల సమయాల్లో జిల్లా స్థాయి అధికారులు సైతం ఈ వంతెనపై నుంచే ప్రయాణించాల్సి వస్తుంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వంతెన నిర్మాణం వెంటనే చేపట్టాలి.
– కొప్పాడ నాగేశ్వరరావు, చినమైనవానిలంక
●

ప్రమాదకరంగా ఉప్పుటేరు వంతెన

ప్రమాదకరంగా ఉప్పుటేరు వంతెన