
వరిలో ఎరువుల వాడకం తగ్గాలి
పెనుమంట్ర: రైతులు సాగు వ్యయంలో దాదాపు 25 శాతం రసాయన ఎరువుల కోసమే ఖర్చుపెడుతున్నారని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డా.టి.శ్రీనివాస్ అన్నారు. వరిలో ఎరువుల మోతాదు తగ్గించుకునేందుకు రైతులకు ఆయన పలు సూచనలు చేశారు. రసాయనిక ఎరువులు దేశంలో సగటున ఎకరాకు 56 కిలోలు వాడుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 102 కిలోలు వినియోగిస్తున్నారని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో సగటున ఎకరాకు 164 కిలోలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 170 కిలోలు వినియోగిస్తున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుమంట్ర, పెనుగొండ, అత్తిలి మండలాల్లో ఎరువుల వినియోగం అత్యధికంగా ఉందని తెలిపారు.
వరిలో ఎరువులు/పోషకాల యాజమాన్యం
● భూసార పరిరక్షణకు, ఉత్పత్తి కోసం రసాయన ఎరువులతో పాటు సేంద్రీయ (లేదా) జీవన ఎరువులను వాడాలి. సేంద్రీయ, రసాయన ఎరువులను కలిపి వినియోగించడం వల్ల భూసారమే పెరగడమే కాకుండా పోషకాల లభ్యత కూడా పెరుగుతుంది.
● వరి మాగాణుల్లో అపరాలు, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి పూతదశకు ముందు కలియదున్నడం ద్వారా భూసారం పెరగడమే కాకుండా సుమారు 20–25% వరకు నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులను ఆదా చేయవచ్చు.
● ద్రవ జీవన ఎరువులైన అజోస్పిరిల్లుం 500 మి.లీ./ఫాస్ఫో బాక్టీరియా 500 మీ.లీ./పొటాషియం సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా 500 మి.లీ./సూడోమోనాస్ 500 మి.లీను ఎకరానికి 20 కిలోల ఇసుక లేదా 100 కిలోల పశువుల ఎరువు లేదా 20 కిలోల వానపాముల ఎరువుతో దమ్ము చేసిన పొలంలో నాటిన 7–10 రోజులకు, 30 రోజులకు వేసుకోవచ్చు.
● భూసార పరీక్షా ఫలితాల ప్రకారం నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వేసుకోవాలి.
● సార్వాలో ఎకరాకు సిఫార్సు చేసిన 36:24:24 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్‌ను స్వర్ణ, ఎంటీయు–1318 రకాలకు తప్ప అన్ని మిగిలిన అన్ని రకాలకు వేసుకోవచ్చు. స్వర్ణ మరియు ఎం.టీ.యు–1318 రకాలకు 24: 24: 24 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్‌ను మాత్రమే వేయాలి.
● నత్రజని వినియోగ సామర్థ్యం పెంచడానికి 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి (లేదా) 250 కిలోల తేమ కలిగిన బంక మట్టిని కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి పొలంలో వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది.
● పురుగులు మరియు తెగుళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు నత్రజని ఎరువుల వాడకం తగ్గించాలి.
● భాస్వరాన్ని దమ్ములోనే ఊడ్పుకు ముందుగా వేసుకోవాలి. ఏకారణం చేతనైనా దమ్ములో వేయలేకపోతే నాట్లు వేసిన 10 రోజుల లోపులో వేసుకోవాలి.
పొటాష్ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే పంటకు కావలసిన పోషకాలను సరైన మోతాదులో సకాలంలో అందించాలి. నత్రజనిని ఎక్కువగా వాడి భాస్వరం, పొటాషియం ఎరువులను సరైన మోతాదులో వేయకపోతే చీడపీడల ఉధృతి పెరిగి, తాలు కంకులు ఎక్కువగా ఏర్పడి, దిగుబడి తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత లోపిస్తుంది. ప్రతి రైతు తప్పనిసరిగా ప్రతి రెండేళ్లకోసారైనా భూసార పరీక్షలు చేయించుకుని ఎరువుల యాజమాన్యం చేపట్టాలి.
డా.టి.శ్రీనివాస్, ఏడీఆర్, మార్టేరు వ్యవసాయ
పరిశోధనా స్థానం

వరిలో ఎరువుల వాడకం తగ్గాలి

వరిలో ఎరువుల వాడకం తగ్గాలి