
నన్ను చంపాలని చూస్తున్నారు
దెందులూరు: కొల్లేరు వాసులకు ఒక్క రూపాయి బాకీ ఉన్నానని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. బుధవారం ఏలూరు జిల్లా కొండలరావుపాలెంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, అబ్బయ్యచౌదరిని ఇబ్బంది పెడితే దెందులూరులో రాజకీయంగా పెత్తనం చేయవచ్చని భావిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే అబ్బయ్యచౌదరి ఇంటికి వెళ్లండి.. ముట్టడించండి, వంటావార్పు చేయండని ఎమ్మెల్యే చింతమనేని పిలుపునిచ్చారని మండిపడ్డారు. తనను బెదిరించి హతమార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను ఉన్నత ఉద్యోగాన్ని వదిలి మంచి చేసేందుకే రాజకీయాల్లో వచ్చానని అన్నారు. ఐదేళ్లు శాసనసభ్యుడిగా ప్రజలకు ఎంతో సేవ చేశానని.. ఏ ఒక్కరి దగ్గర రూపాయి కూడా తీసుకునే ఆలోచన తమకు లేదన్నారు. నాలుగు దశాబ్దాలుగా సేవ చేసే కుటుంబంగా ప్రజలతో కొఠారు కుటుంబానికి అనుబంధం ఉందన్నారు. తన హయాంలో టీడీపీ కార్యకర్తలకు సైతం మంచి చేశానన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కుటుంబంతో కూడా సమయం గడపకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నానన్నారు. దెందులూరు నియోజకవర్గంలో 20 ఏళ్ల తర్వాతైనా తాను చేసిన మంచి కనిపిస్తుందన్నారు. అలాంటి తన ఇంటిపై రాళ్లు వేసి, వంటావార్పులు పెట్టించి ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు చెరువులు, పొలాలు ఆక్రమిస్తున్నారని, పెట్రోల్ బంకులు, ఇల్లు ధ్వంసం చేస్తున్నారన్నారు. రౌడీషీటర్లను పంపి భయపెట్టాలని చూశారని.. 144 సెక్షన్ ఉన్నా, పోలీసులు ఆపుతున్నా దెందులూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తన ఇంటికి వచ్చి అండగా నిలిచారని అబ్బయ్యచౌదరి అన్నారు.
కొల్లేరులో వికృత రాజకీయ క్రీడ
కొల్లేరు ప్రాంతంలో వికృత రాజకీయ క్రీడ జరుగుతుందని అబ్బయ్యచౌదరి అన్నారు. తన తండ్రి రామచంద్రరావు సహకారంతోనే చింతమనేని ఎంపీపీ అయ్యారని గుర్తు చేశారు. కొల్లేరు వాసులను బెదిరించి, తమపై ఉసిగొల్పుతున్నారని.. మీకు గాని, మీ గ్రామానికి గాని బాకీ ఉన్నానని నిర్ధారించేందుకు తాను కమిటీ వేస్తానని, మీరు కూడా ఒక కమిటీ వేసి నిజనిర్ధారణకు రావాలని ఏలూరు కోటదిబ్బ వద్ద నిరసన తెలుపుతున్న వారిని ప్రశ్నించారు. కలెక్టర్, ఎస్పీ కూడా కమిటీలో భాగస్వాములై నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి నాని, జానంపేట ప్రసాద్‌బాబు, అప్పన్న ప్రసాద్, తేరా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్పీకి ఫిర్యాదు : నియోజకవర్గంలో పరిణామాలతో పాటు రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలపై కొఠారు అబ్బయ్యచౌదరి ఏలూరులో ఏఎస్పీ నక్కా సూర్య చంద్రరావుకు లిఖితపూర్వకంగా వినతిపత్రం అందచేశారు.
మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి