చంద్రబాబు.. ది గ్రేట్‌ వన్‌సైడ్‌ లవర్‌!

Vardelli Murali Editorial About Chandrababu One Side Love Satirical Way - Sakshi

జనతంత్రం

సావిరహే తవదీనా రాధా!... యమునా తీరమునా సంధ్యా సమయమునా వేయి కనులతో రాధా వేచియున్నది కాదా!... ఇది క్లాసికల్‌ ప్రేమసందేశం. కాలక్రమంలో కవులు, కళాకారులు, రచయితలు, సినిమా దర్శకులు ప్రేమ సందేశాల వ్యక్తీకరణలో విప్లవాత్మక ప్రయోగాలు చేపట్టారు. పెక్కు సంస్కరణలు మోసుకొచ్చారు. తాజాగా రాజకీయ ప్రేమ సందేశాలు కూడా రంగప్రవేశం చేశాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ధనప్రభావాన్ని జొప్పించిన నాయకుడు, ఓట్లను కొనుగోలు చేసే పద్ధతికి ఆద్యుడు, వెన్నుపోటును ప్రజాస్వామ్య పరిరక్షణగా మెప్పించగలిగిన దిట్ట, మీడియాను మచ్చిక చేసుకుని అచ్చికబుచ్చికలాడుతున్న నేర్పరి ఎవరైతే ఉన్నారో వారే ఈ రాజకీయ ప్రేమరాకెట్‌ను కుప్పం అంతరిక్ష కేంద్రం నుంచి మొన్న ప్రయోగించారు.

పాతతరం సినిమా ‘మరోచరిత్ర’లో దర్శకుడు బాలచందర్‌ చెప్పినంత వెరయిటీగా, కొత్తతరం దర్శకుడు ‘జాతిరత్నాలు’ సినిమాలో చెప్పినంత ఆఫ్‌బీట్‌గా చంద్రబాబు రాజకీయ ప్రేమ సందేశాన్ని చెప్పగలిగారు. ముందుగా ‘ఇట్లు తమ విధేయుడు’ అనదగ్గ కార్యకర్త ఒకరు లేచి ‘మనం జనసేనతో పొత్తు పెట్టుకుందాం సార్‌’ అని టాపిక్‌ను అందించాడు. మామూలు గానైతే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఇలాంటి సందర్భాల్లో కొన్ని స్టాండర్డ్‌ సమాధానాల్లో ఏదో ఒకటి చెబుతారు. ఒకటి: ఆ పార్టీ బీజేపీ మిత్రపక్షంగా ఉన్నది కదా! వాళ్లు విడిపోతే చూద్దాం. రెండు: ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఇప్పుడే పొత్తుల గురించి ఎందుకు? మూడు: పొత్తులు అవసరమా లేదా అనే అంశాన్ని పార్టీ కార్యవర్గంలో చర్చించవలసి ఉన్నది. చంద్రబాబు వీటిలో ఏదీ చెప్పలేదు.

‘నువ్వొక అమ్మాయిని ప్రేమిస్తున్నావనుకో తమ్ముడూ... అది వన్‌సైడ్‌ లవ్వయితే కుదరదు కదా! అటునుంచి కూడా ప్రేమించాలి కదా’ అంటూ తన మనసులో ఉన్న ప్రేమ కథను వెల్లడించారు. తానిప్పుడు వన్‌సైడ్‌ లవ్‌లో ఉన్నట్టు అంగీక రించారు. తాను ప్రేమిస్తున్న పార్టీ మరో పార్టీతో సహజీవనం చేస్తున్నా సరే, కలిసి డ్యూయెట్‌ పాడేందుకు తాను సిద్ధమేనని పరోక్షంగా కుండ పగలగొట్టారు. అవతలి పార్టీ కూడా మరో కుండ పగలగొట్టి ‘సై’ అంటుందా, ‘ఛీ పో’ అంటుందా అన్నది ఇంకా తేలవలసి ఉన్నది.

చంద్రబాబు రాజకీయ ప్రేమకథలన్నీ ఎప్పుడూ వన్‌సైడ్‌ లవ్‌గానే ప్రారంభమౌతాయి. తన అవసరాన్ని బట్టి ముందుగా తాను ప్రేమిస్తాడు. తర్వాత సదరు పార్టీ ప్రేమించవలసి వస్తుంది. నయానో భయానో మీడియా ద్వారానో ఒప్పుకునేలా చేస్తారు... ఈతరం యాసిడ్‌ బాటిల్‌ ప్రేమికుడి తరహాలో!... అయితే యాసిడ్‌ బాటిల్‌ తన చేతిలో ఉండదు. పెంపుడు మీడియా చేతిలో ఉంటుంది. ఆయన ప్రేమకు స్పందించక పోయినా, లేదా ఆయనకే మొహం మొత్తినా అవతలి పార్టీపై యాసిడ్‌ చల్లే బాధ్యత పెంపుడు మీడియాదే! వాజ్‌పేయి ప్రతిష్ఠతో ఎన్నికల్లో గట్టెక్కాలనుకున్నప్పుడు పెంపుడు మీడియాకు బీజేపీ అభ్యుదయ పార్టీగా కనబడింది. పొత్తు వద్దనుకున్నప్పుడు అదే పార్టీ మసీదులు కూల్చే పార్టీగా కనిపిం చింది. కమ్యూనిస్టులు అవసరమైనప్పుడు కమ్యూనిజం గ్రేట్‌! అవసరం తీరిన తర్వాత టూరిజం గ్రేట్‌! ఓడ మల్లయ్య – బోడి మల్లయ్య థియరీ!

గడిచిన మూడు నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీకి బహిరంగ ప్రేమకథలు లేవు... లోపాయకారీ వ్యవహారాలు తప్ప! ‘విరహము కూడా సుఖమే కాదా, విరహపు చింతన మధురము కాదా’ అని పాడుకుంటూ ఈ కాసింత కాలాన్ని నెట్టుకొచ్చేసింది. ఇక విరహ వేదన తన వల్ల కాదనే నిర్ణయానికి వచ్చేసినట్లుంది. కాళిదాసు మేఘసందేశాలనూ, శ్రీనాథుడి హంస రాయబారాలనూ మొదలుపెట్టింది. ఈ మార్పునకు కారణమేమిటి? తెలుగుదేశం పార్టీ అధినేతల అసలు సిసలైన విరహ వేదన అధికారంతో! రాజకీయ పొత్తుల కోసం కాదు!! దూరమైన అధికారం దరికి మళ్లీ చేరడం అంత సులభసాధ్యం కాదని బోధపడింది. తత్వం అవగతమైంది.

సాధారణ ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మధ్య పది శాతానికి పైగా ఓట్ల తేడా కనబడింది. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి ఈ తేడా రెండు రెట్లు పెరిగింది. ప్రతిపక్ష పార్టీ చేయించుకున్న సర్వేల్లోనే అధికార పార్టీ బలం 50 శాతానికంటే తగ్గే అవకాశం, తమ ఓట్లు 35 శాతం కంటే పెరిగే అవకాశం లేదని వెల్లడైనట్లు సమాచారం. మరిప్పుడెలా? అధికారాన్ని అందుకోవడానికి ఉన్న దారులే మిటి? ఈ అంశంపై జరిగిన అనేక మేధోమథనాల తర్వాత ఒక ద్విముఖ వ్యూహాన్ని ఆ పార్టీ రూపొందించినట్టు తెలుస్తున్నది.

చిన్నాచితకా పార్టీలైనా సరే వీలయినన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి. చినుకు చినుకునూ ఒడిసిపట్టి ఓట్ల శాతాన్ని పెంచుకోవాలి. ఇది వ్యూహంలో పార్ట్‌ వన్‌! అధికార పార్టీ బలం యాభై శాతంకంటే తగ్గకపోతే ఎన్ని ఓట్లను పెంచుకున్నా ఏం ఫాయిదా? అందుకని వాళ్ల ఓట్లు తగ్గేలా నిందాప్రచారం చేయాలి. ఇది పార్ట్‌ టూ! ఈ ద్విముఖ వ్యూహాన్ని ఇప్పుడు చంద్రబాబు ప్రారంభించారు. ఉన్మాదం ఊరేగుతున్నట్టుగా, అబద్ధాలు అంబారీనెక్కినట్టుగా ఉధృత స్థాయిలో నిందాప్రచారం మొదలైంది. ఈ నిందలకు ఒక ఆధారం లేదు, ఒక తర్కం లేదు, ఒక విచక్షణ లేదు. బట్ట కాల్చి మీద వేయడమే సింగిల్‌ పాయింట్‌ కార్యక్రమం.

ఆంధ్రప్రదేశ్‌కు విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్‌మోహన్‌రెడ్డి వల్ల జరిగిన నష్టమే ఎక్కువట? ఎలా అని వివరాలడగొద్దు. చెప్పింది వినండి అంతే! రాజధానిని కోల్పోయి ఖండిత శరీరంతో మిగిలిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదనీ, అదేమీ సంజీవని కాదనీ చెప్పిందెవరు? ఢిల్లీ దర్బార్‌ కటాక్ష వీక్షణాల కోసం తాకట్టు పెట్టిందెవరు?.. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉపయోగించుకునే సౌలభ్యాన్ని వదిలేసుకుని, ఉమ్మడి ఆస్తుల లెక్క తేల్చకుండా రాత్రికి రాత్రి పారిపోయి వచ్చిందెవరు? దీనివల్ల జరిగిన నష్టమెంత? చరిత్ర అడగొద్దు, చెప్పింది వినాలంతే!

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానికి వెళ్లడం, ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలవడం రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టుల విషయంలో విజ్ఞప్తులు చేయడం సహజమైన విషయం. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్తే అది రాష్ట్ర ప్రయోజనాల కోసం! జగన్‌ మోహన్‌రెడ్డి సీఎంగా ఢిల్లీ వెళ్తే అది కేసుల మాఫీ కోసం!! ఇదీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో బాబు, ఆయన పెంపుడు మీడియా ఉన్మాద స్థాయికి చేర్చిన విష ప్రచారం. ఏం కేసులవి? ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు?

జనరంజక పరిపాలన అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దుర్వార్తను తట్టుకోలేక వందలాదిమంది గుండె పగిలి చనిపోయారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలే శిఖరాయమానుడైన తండ్రిని కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న వైఎస్‌ జగన్‌ను ఈ పరిణామం మరింత కలచివేసింది. ఉద్వేగం కట్టలు తెగింది. చనిపోయిన వాళ్లంతా తన బంధువులే నని ఆయన ప్రకటించారు. హెలికాప్టర్‌ ప్రమాదం జరిగిన నల్లకాలువ ప్రాంతంలో జరిగిన సంస్మరణ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. 

ఒక ఆత్మబంధువుగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులందరినీ స్వయంగా వచ్చి కలుస్తానని అదే సభలో మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ‘ఓదార్పు యాత్ర’ను ప్రారంభించారు. పోయిన ప్రతిచోటా అఖండ ప్రజాదరణ వెల్లువెత్తింది. కొందరు నేతలకిది కంటగింపుగా మారింది. ఢిల్లీకి ఫిర్యాదులు చేశారు. ‘ఓదార్పు యాత్ర’ ఆపేయాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశించింది. కుటుంబ సమేతంగా జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీని కలుసుకున్నారు. తాను ఏ సమయంలో ఆ మాటను ఇవ్వాల్సి వచ్చిందో, దాన్ని ఎందుకు నిలబెట్టుకోవాలో ఆమెకు నివేదించారు. అప్పుడు ప్రపంచం లోనే అత్యంత శక్తిమంతులైన టాప్‌ ఫైవ్‌ నేతల్లో ఆమె ఒకరు. వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తికి మూల విరాట్టు ససేమిరా అన్నది. ఆమె మాట వినకుంటే ఇబ్బందులపాలవుతావనీ, వింటే కొంతకాలం తర్వాత ముఖ్యమంత్రి అవుతావనీ హైకమాండ్‌ ముఖ్యులు తేల్చిచెప్పారు. అయినా జగన్‌మోహన్‌రెడ్డి మాటకే కట్టుబడాలని నిర్ణయించుకున్నారు.

ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ఎదుర్కొంటున్న కేసులు ఆ పరిణామాల పర్యవసానాలు. కేసుల రూపకల్పనలో అతి ఉత్సాహంగా కాంగ్రెస్‌ పార్టీకి తెలుగుదేశం పార్టీ, దాని పెంపుడు మీడియా తోడ్పాటును అందించాయి. కాంగ్రెస్‌ మైనస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తమ రాజకీయ ప్రత్యర్థిగా ఉండాలని బాబు కోరుకున్నారు. అందుకోసమే ఈ కుట్రలో ముఖ్య పాత్ర పోషించారు. ‘కొంతకాలం కాంగ్రెస్‌ పార్టీలో ఉంటే జగన్‌ను సీఎం చేసే వాళ్లం, మా మాట వినలేద’ని ఒక బహిరంగ సభలో కాంగ్రెస్‌ అగ్రనేత గులామ్‌ నబీ ఆజాద్‌ ప్రకటించిన విషయం ఒక్కటి చాలదా ఈ కేసుల బాగోతం తేల్చడానికి? ఇటువంటి కేసుల బూచిని చూపెడుతూ గత పదేళ్లుగా తెలుగుదేశం పార్టీ తన రాజకీయ బతుకును ఈడ్చు కొస్తున్నది.

తెలుగుదేశం పార్టీ ద్విముఖ వ్యూహం ఆత్మతృప్తికి తప్ప ఫలితమిచ్చేది కాదు. ఆయన సీజనల్‌ ప్రేమల సంగతి తెలియని వారు లేరు. స్వీయానుభవం కలిగిన బీజేపీ గానీ కమ్యూనిస్టులు గానీ మరోసారి బాబు ఉచ్చులో పడేందుకు సిద్ధపడరు. సిద్ధపడితే వారి ఖర్మ. ప్రస్తుతానికైతే బాబు చిరకాల మిత్రుడు పవన్‌ కళ్యాణ్‌ వైపునకు మాత్రమే లవ్‌సిగ్నల్స్‌ ప్రసారమ య్యాయి. తన ముఖం చూసి కాకపోయినా అమరావతి ముఖం చూసైనా కలిసి పనిచేద్దామని తెరవెనుక రాయబారాలను నడుపుతున్నట్టు వినికిడి. ఇందుకు తొలిమెట్టుగా ఒక కార్యక్ర మాన్ని చేపట్టినట్టు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున పార్లమెంట్‌కు ఎన్నికై తెలుగుదేశం, దాని పెంపుడు మీడియా పంచన చేరిన ఒక విదూషకుడి చేత రాజీనామా చేయించి, అమరావతి పేరుతో మళ్లీ నిలబెడతారట! అతనికి అందరూ మద్దతునిచ్చి ఏకైక రాజధాని నినాదాన్ని చాటాలని బాబు దూతలు వ్యవహారం నడుపుతున్నారట! బ్యాంకులను మోసం చేసి, వేలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న ఈ విదూషకుడికి మద్దతునివ్వడమంటే రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమే నని దాదాపు అన్ని పార్టీలూ భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

అవసరార్థం కలిగే సీజనల్‌ ప్రేమలతో ఏర్పాటయ్యే అవకాశవాద పొత్తులు ఫలితమివ్వబోవని ఉమ్మడి రాష్ట్రంలోని చివరి ఎన్నికల్లో మహాకూటమి ప్రయోగం చాటిచెప్పింది. అయినా సుదీర్ఘ రాజకీయానుభవం కలిగిన చంద్రబాబు గుణపాఠం తీసుకోలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అమరావతి భూములను మాత్రమే ప్రేమించి, ఆ భూముల్లో పేదవర్గాలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని అడ్డుతగిలేవారిని ప్రజలెట్లా ప్రేమిస్తారు? ప్రజల ప్రేమను చూరగొనకుండా అధికారం ఎట్లా సంప్రాప్తిస్తుంది? ఇంత చిన్న లాజిక్‌ను సీనియర్‌ మోస్ట్‌ రాజకీయవేత్త ఎలా మిస్సయ్యారు? ఇదొక్కటే కాదు పేద ప్రజల స్వావలంబనకు, సాధికారతకు, ఆత్మగౌరవానికి ఆలంబనగా నిలబడుతున్న ప్రతి కార్యక్రమానికీ తెలుగుదేశం పార్టీ అడ్డు తగులుతున్నది. ఈ ధోరణి ప్రజలను ద్వేషించడమే అవుతుంది. ప్రజలను ద్వేషిస్తూ, పవన్‌ కళ్యాణ్‌ను మాత్రం ప్రేమిస్తే ఒరిగేదేమీ ఉండదు.

''తెలుగుదేశం పార్టీ ద్విముఖ వ్యూహం ఆత్మతృప్తికి తప్ప ఫలితమిచ్చేది కాదు. ఆయన సీజనల్‌ ప్రేమల సంగతి తెలియనివారు లేరు. స్వీయానుభవం కలిగిన బీజేపీ గానీ కమ్యూనిస్టులు గానీ మరోసారి బాబు ఉచ్చులో పడేందుకు సిద్ధపడరు. సిద్ధపడితే వారి ఖర్మ. ప్రస్తుతానికైతే బాబు చిరకాల మిత్రుడు పవన్‌ కళ్యాణ్‌ వైపునకు మాత్రమే లవ్‌సిగ్నల్స్‌ ప్రసారమయ్యాయి. తన ముఖం చూసి కాకపోయినా అమరావతి ముఖం చూసైనా కలిసి పనిచేద్దామని తెరవెనుక రాయబారా లను నడుపుతున్నట్టు వినికిడి. ఇందుకు తొలిమెట్టుగా ఒక కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెబుతున్నారు.

వైఎస్సార్‌సీపీ తరఫున పార్లమెంట్‌కు ఎన్నికై తెలుగు దేశం, దాని పెంపుడు మీడియా పంచన చేరిన ఒక విదూషకుడి చేత రాజీనామా చేయించి, అమరావతి పేరుతో మళ్లీ నిలబెడతారట! అతనికి అందరూ మద్దతు నిచ్చి ఏకైక రాజధాని నినాదాన్ని చాటాలని బాబు దూతలు వ్యవహారం నడుపుతున్నారట! బ్యాంకులను మోసంచేసి, వేలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న ఈ విదూషకుడికి మద్దతునివ్వడమంటే రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమేనని దాదాపు అన్ని పార్టీలూ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అవసరార్థం కలిగే సీజనల్‌ ప్రేమలతో ఏర్పాటయ్యే అవకాశవాద పొత్తులు ఫలితమివ్వబోవని ఉమ్మడి రాష్ట్రంలోని చివరి ఎన్నికల్లో మహాకూటమి ప్రయోగం చాటిచెప్పింది. అయినా సుదీర్ఘ రాజకీయానుభవం కలిగిన చంద్రబాబు గుణపాఠం తీసుకోలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.''


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top